అకస్మాత్తుగా సోనియా గాంధీ తన ఆత్మకథ రాసింది. అది నవంబర్‌లో విడుదల అవుతుందని పెంగ్విన్ రాండమ్ హౌజ్ అంతర్జాతీయ విభాగం ఆల్‌ఫ్రెడ్ ఎక్నాఫ్ ప్రకటించింది. దానిపేరు ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ జీవితాంతం ప్రైవేటు జీవితం గురించి ఒక్కమాట కూడా మాట్లాడని సోనియా గాంధీ ఆత్మకథ రాస్తే అందులో ఏముంటుంది అనే ఆసక్తి ప్రపంచ రీడర్స్‌లో చాలా ఉంటుంది. ఆమె జీవితంలో 1968లో రాజీవ్ గాంధీతో పెండ్లి అయిన దగ్గర నుంచి1991లో రాజీవ్ గాంధీ చనిపోయేవరకు ఒక ఘట్టం. 1998లో పూర్తిగా భయాందోళనలో బతుకుతోందని, పిల్లలను పెంచి, చదివించి, పెద్దోళ్లను చేయడం తప్ప ఆమె మరేమీ ఈ దేశంలో కోరుకోవడం లేదని వదంతులు, చర్చలు ఉన్న దశలో, పార్టీ ఇక కోలుకోదు అని చర్చ జరుగుతున్న దశలో ఆమె పార్టీ అధ్యక్షురాలు అయింది. అప్పటికి ఆమె ఎక్కడా ఉపన్యాసం ఇచ్చిన దాఖలాలు లేవు.
రాజకీయాలు మాట్లాడిన దాఖలాలు లేవు. అసలు రాజీవ్‌గాంధీ రాజకీయాలలోకి రావడమే ఆమెకు ఇష్టం లేదు అని దేశమంతా కోడై కూస్తున్న దశలో ఆమె పార్టీ అధ్యక్ష పదవి చేపట్టింది. అదీ ఆశ్చర్యమే. ఆమె 1999లో పార్లమెంటుకు ఎన్నికైంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చి వాజ్‌పేయి పీఎం పదవి చేపట్టారు. ఆ ఐదేండ్లు ఆమెది అపోజిషన్ పార్టీ లీడర్ పోరాటమే.
తరువాత 2004లో ప్రధానమంత్రిగా కావల్సింది. కానీ, తను కాకుండా మన్‌మోహన్ సింగ్‌ను చేసింది. ఎందుకు? బీజేపీ నుంచి విదేశస్తురాలిని చేయడానికి వీలులేదని గొడవతో తాను వదులుకుంది. ఒక రాజకీయ నాయకుడు కాని మన్‌మోహన్‌ను ప్రధానమంత్రిని చేసింది. ఆ పదేండ్లకాలం అధికారంలో ఉండి కూడా ఆమె.. ఆర్ఎస్ఎస్, బీజేపీ విదేశస్తురాలు, ఇటలీకి, ఇతర క్రిస్టియన్ దేశాలకు చాలా ఒప్పందాలతో మేలు చేసిందని ప్రచారం చేసినా కానీ, ఆమె ఎప్పుడూ కూడా నోరెత్తి గట్టిగా ఎదిరించలేదు. పగసాధింపు చర్యలకు దిగలేదు. ఇక అధికారం
కోల్పోయాక ఆ కుటుంబం కష్టాలకు అంతులేదు.
సోనియా కుటుంబంపై రాజకీయ దాడి
ఇంత కొట్లాటలు, హత్యా రాజకీయ వాతావరణంలో రాజకీయాల్లో ఉండి ఆమె అంత సైలెంట్‌గా ఎలా ఉండగలిగారు అనేది కూడా పెద్ద చర్చనీయాంశమే. 2014లో మోదీ ప్రధాన మంత్రిగా పోటీకి దిగి ఆ కుటుంబం మీద విపరీతమైన రాజకీయ దాడి చేశారు. ఆమె పూర్తిగా ప్రచారానికి దూరంగా ఉండి.. రాహుల్ గాంధీని ప్రచారంలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోదీ ఆయనను రాజకుమారుడు, విదేశీ సంతతి వ్యక్తి అని ప్రచారం చేసినా కూడా సోనియాగాంధీ ఒక్క ప్రెస్‌మీటింగ్ పెట్టి వాళ్లని గట్టిగా ఎదిరించింది లేదు. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ అధికారంలో ఉన్న గత 12ఏండ్లలో రాహుల్ గాంధీ మీద, సోనియాగాంధీ చాలా కేసులు, ఈడీ విచారణ, ఆమె ఉనికిని, నీతిని, నిజాయితీని తూర్పారపట్టడం చేస్తూనే ఉన్నారు. కానీ ఆమె బీజేపీ, ఆర్‌ఎస్ఎస్
నాయకులను కఠిన పదాలతో విమర్శించిన సందర్భం లేదు. ఇప్పుడు ఆమె తన ప్రైవేటు జీవితాన్ని ప్రపంచం ముందు పెట్టబోతున్నారు.
ఈ పుస్తకం ఆమెకు ఏం ఇవ్వబోతుంది?
పెద్ద మేధావి అనుకున్న మన్‌మోహన్ సింగ్ తన ఆత్మకథను రాయకుండానే చనిపోయాడు. ఇందిరా గాంధీ ఆత్మకథ రాయలేదు. రాజీవ్ గాంధీ ఏమీ రాయలేదు. నెహ్రూ తరువాత ఆ కుటుంబంలో సోనియాగాంధీ ఆత్మకథ రాసింది. అది అతిపెద్ద అంతర్జాతీయ పబ్లిషర్ ద్వారా అమెరికా నుంచి వెలువడుతుంది. ఇది నిజంగా ఆమె ఈ దేశం ముందు, భవిష్యత్ తరాల కోసం విడిచిపెట్టిపోయే చరిత్ర. అదీ 80 ఏండ్ల వయసులో. ఇది చాలా అవసరమైన పని కూడా. సోనియా మదర్ థెరిస్సా తరువాత ఈ దేశంలో చాలా బలమైన రాజకీయ రంగంలో జీవించిన విదేశీ స్త్రీ. ఈ దేశాన్ని మదర్ లాగే సొంతం చేసుకుంది. ఆమె పుస్తకం పేరు మనకు సూచించేది ‘నేను ఎక్కడ పుట్టినా ఇండియన్‌ని. నా బిలాంగింగ్‌నెస్‌ని ఎవరూ తొలగించలేరు’ అని, ఇది కచ్చితంగా ఆమె పుస్తకంలో తెలుస్తుంది. దేశాన్ని ఏలిన మోదీ జీవితాన్ని, అతని రాజకీయ విలువల్ని, సోనియా రాజకీయ విలువల్ని అంచనా వేయడానికి ఈ పుస్తకం బాగా పనికొస్తుంది. ఆమె పుట్టి పెరిగిన సంస్కృతి, ఆచరించిన జీవనవిధానం, ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, యూపీఏ చైర్‌పర్సన్‌గా మన్‌మోహన్ సింగ్ ద్వారా చేయించిన పనులు, మోదీచేత ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భాగవత్ చేయించిన పనులు బేరీజు వేయడానికి వీలు అవుతుంది. బీదలు, ఆదివాసులు, దళితులు, విద్య, తిండిలేనివారి పట్ల ఎవరు ఏ సాంస్కృతిక విలువలతో వ్యవహరించారో అంచనా వేయడానికి వీలు అవుతుంది. మోహన్ భాగవత్, మోదీలు కూడా తమ ఆత్మకథలు హానెస్ట్‌గా రాస్తే ఎంతో బాగా పోల్చి అంచనా వేయవచ్చు.
ఆమె ప్రేమ ప్రయాణం
ఈ దేశంలో పుట్టకపోయినా, ఒక హిందువుగా పుట్టకపోయినా, ఒక క్యాథలిక్ క్రిస్టియన్ కుటుంబంలో.. కేథలిక్ క్రిస్టియన్ దేశమైన ఇటలీలో పుట్టినా ఆమె ఈ దేశ బీదలపట్ల, ఆహార భద్రత పట్ల, విద్యాహక్కుల పట్ల జాతీయ దృక్పథం నిర్ణయాలు తీసుకుందా లేదా ఇటాలియన్ దృక్పథంలో నిర్ణయం తీసుకుందా అంచనా వేయవచ్చు. అదేవిధంగా మోహన్ భాగవత్, మోదీ బీజేపీ పట్ల ప్రేమ, ఆదరణ, కరుణ, దయతో నిర్ణయాలు తీసుకుని గత పన్నేండ్లలో ఎంత మార్చారు. సోనియా పదేండ్లలో ఎంత మార్చింది అంచనా వేయవచ్చు. అప్పుడు జాతీయతకు నిర్వచనం పుట్టుకతో కాకుండా ప్రజల పట్ల వ్యక్తి ప్రేమతో అంచనా వేయవచ్చు. ఆమె పుస్తకం సబ్ టైటిల్ జర్నీ ఆఫ్ లవ్ (ప్రేమ ప్రయాణం)లో రాజీవ్ గాంధీతో తనుపడ్డ ప్రేమ ప్రయాణం గురించి రాస్తుందని నేను అనుకోను. ఈ దేశం పట్ల, ఇక్కడి ప్రజల పట్ల తనకు ఎటువంటి ప్రేమ ఉండిందో, ఏం చేసిందో చెబుతుందనే నేను భావిస్తున్నాను.
ఆత్మకథను అబద్ధాలతో రాస్తే..
నేను నా ఆత్మకథ రాశాను. ఇంగ్లిష్‌లో ఉంది. అది ‘ఏ శూద్ర లైఫ్’ ( ఓ శూద్ర జీవితం) ఆత్మకథ. చదివినోళ్లకు తన గురించి తాను అబద్ధాలతో పొగుడుకుంటే ఐదు పేజీలను మించి ఎవరూ చదవరు. వ్యక్తి నిజాలు రాశాడు అని నమ్మించగలిగితేనే ఆ పుస్తకాన్ని పదులు, వందలు, వేలు, లక్షల మంది చదువుతారు. ఒకవేళ ఒక వ్యక్తి హత్యలు చేయించి నేను అహింస పాటించాను అంటే రాసే క్రమంలో ఆ వ్యక్తి రాసే పదాలు, వాక్య నిర్మాణం అంతా బయటపెడతాయి. తన గురించి తాను చేసిన మంచి, చెడులను నిజాయితీతో చెబితేనే రీడర్స్ దాన్ని చదువుతారు. లేకపోతే పక్కకు పడేస్తారు.
సోనియా మానవులందరి పట్ల ప్రేమతో ఉందా!
సోనియా ఆత్మకథ ఇప్పటివరకు ఆమె గురించి ఈ దేశానికి, ప్రపంచానికి తెలిసిన వాస్తవాలకు, ఆమె గురించి ఇప్పటివరకు ఇతరులు రాసిన రాతలు, ఆమె స్వయంగా రాసిన రాతను బేరీజు వేస్తుంది. ఆమె జీవితంలో మానవాళిని మతంతో, కులంతో, జెండర్‌తో సంబంధం లేకుండా ప్రేమించిందా, లేదా ద్వేషపూరిత విలువల ద్వారా బతికిందా అని ఈ పుస్తకం కచ్చితంగా తెలియజెబుతుంది. అందుకే ఆమెను విదేశీ ఏజెంటు అన్న నాయకులు ఆమెలా ఆత్మకథలు రాసి అంతర్జాతీయ స్థాయిలో అచ్చు వేయిస్తారా లేదా అనేది వారి ముందున్న పెద్ద చాలెంజ్. ఆమె మోహన్ భాగవత్‌కు, మోదీకి పెద్ద చాలెంజ్‌ని విసిరింది.
అగ్ని పరీక్ష
ఈ పుస్తకం సోనియా గాంధీకి అగ్నిపరీక్షే. మోదీకి, మోహన్ భాగవత్‌కు అగ్నిపరీక్షే. ఇంతపెద్ద అగ్నిపరీక్ష జీవితాంతం సైలెంటుగా బతికిన సోనియాగాంధీ అక్షర రూపంలో తన జీవితాన్ని చెక్కి హిందూత్వ వాదానికి పెడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. సోనియా జీవితాన్ని ప్రపంచమంతటా ఆసక్తిగా చదువుతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా జీవిత చరిత్ర కంటే సోనియా గాంధీ జీవిత చరిత్రపై ప్రపంచం ఎక్కువ ఆసక్తిని చూపుతుంది. ఆమె సైలెంటుగా శత్రువును బంధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నదని నాకు అనిపిస్తుంది. ఈ పుస్తకం రాకముందే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ క్యాంపు కంగారు పడుతుందని ఆమెమీద వాళ్లు మొదలుపెట్టిన కొత్త వదంతులు చెబుతున్నాయి. కానీ అవి ప్రపంచాన్ని నమ్మించలేవు. ఇది గ్లోబలైజ్‌డ్ ప్రపంచమని ఆమె ప్రత్యర్థులు మరిచిపోతున్నారు.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
