హైదరాబాద్: ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కారుమూరిపై ఇప్పటికే ఈడీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. కొండాపూర్‌లోని కారుమూరి ఇంట్లోనే ఆయనను అరెస్ట్ చేశారు. బషీర్‌బాగ్ ఈడీ ఆఫీసుకు కారుమూరి నాగేశ్వరరావును తరలించారు.
టెండర్లలో నగదు లావాదేవీలు, అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేసింది. ఈ కేసులో ఇప్పటికే కారుమూరి సునీల్తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసింది. టెండర్లలో సిగ్మా సప్లయ్ చైన్ సొల్యూషన్ను ఫ్రంట్ కంపెనీగా ఉపయోగించినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. హవాలా లావాదేవీలపై కూడా దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది.
లిక్కర్ వ్యాపారుల నుంచి మడుపులు అందుకున్నారనేది మాజీ మంత్రి కారుమూరిపై ఉన్న ప్రధాన ఆరోపణ. అరెస్ట్ అయిన వారిలో వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డి, కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వర రావు ఉన్నారు. ఏపీ స్టేట్ బివరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం రవాణా టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని.. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనేది ఈ కేసులో ఈడీ ప్రధాన ఆరోపణ. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ వంటి సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలను విరుద్ధంగా మార్చి ప్రభుత్వ ఆదాయానికి రూ.195 కోట్ల మేర ఆదాయానికి గండికొట్టారని ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
