కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి.. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు.. : పీసీసీ చీఫ్

కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి.. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు.. : పీసీసీ చీఫ్

నిజామాబాద్ జిల్లాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు (23 ఆగష్టు) ప్రెస్ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ... నిజామాబాద్  జిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పని చేస్తున్నామని, కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కళాశాల వచ్చాయని పీసీసీ చీఫ్ తెలిపారు. జిల్లాలో రూ. 600 కోట్లతో రహదారుల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటవుతున్నాయన్నారు.

 ఇందిరమ్మ ఇళ్ల ద్వారా లక్షల సంఖ్యలో ఇళ్లు ఇస్తున్నామని, ఉచిత విద్యుత్, రైతు భరోసా, బోనస్ అందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్నారని చెప్పారు. త్వరలోనే మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, ఆర్మూర్‌లో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

పార్టీని బలోపేతం చేస్తూ, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు అలాగే పార్టీ కోసం ఎల్లప్పుడూ సేవ చేసిన వారికి సొసైటీ చైర్మన్ పదవుల్లో అవకాశాలు ఇస్తామని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ, హద్దులు దాటి సీఎంపై లేదా పార్టీపై అడ్డగోలుగా మాట్లాడితే ఉరుకోబోమని స్పష్టం చేశారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలని, బాహాటంగా మాట్లాడితే క్రమశిక్షణ కమిటీ ద్వారా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇందూరును స్మార్ట్ సిటీగా చేయడంలో బీజేపీ విఫలమైందని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిందేం లేదని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.