భారతదేశంలో పత్రికల ప్రస్థానం.. 'ఫోర్త్ ఎస్టేట్' గా జర్నలిజం ఆసక్తికరమైన చరిత్ర!

భారతదేశంలో పత్రికల ప్రస్థానం.. 'ఫోర్త్ ఎస్టేట్' గా జర్నలిజం ఆసక్తికరమైన చరిత్ర!

ప్రజాస్వామ్యానికి 'నాలుగో స్థూబం' (ఫోర్త్ ఎస్టేట్) అయిన పత్రికల ప్రస్థానం వెనుక ఎంతో చరిత్ర, బ్రిటిష్ పాలకుల కాలంలో సాగిన సుదీర్ఘ పోరాటం ఉంది. మన దేశంలో పత్రికలు తొలి రోజుల్లో ఎలా పుట్టాయి? బ్రిటిష్ వారి కఠినమైన ఆంక్షలు, సెన్సార్‌షిప్‌లను తట్టుకుంటూ స్వతంత్ర పోరాటంలో జర్నలిజం ఎలాంటి అద్వితీయమైన పాత్ర పోషించిందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం!

*ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించి ప్రజలను చైతన్యవంతులుగా చేసి వారిలో జాతీయ అభిమానాన్ని పెంపొందించడంలో పత్రికలు అద్వితీయమైన పాత్రను పోషిస్తాయి. 

*మధ్యయుగంలో మొగలుల పరిపాలనకాలంలో అక్బరాత్ పేరుతో వెలువడే పత్రికలు వాభ్యునవీస్ అనే ఉద్యోగులు నిర్వహించేవారు. 

*లార్డ్ మెకాలే బ్రిటన్ పార్లమెంటులోని గ్యాలరీలో కూర్చున్న పత్రికా విలేకరులను ఫోర్త్ ఎస్టేట్​గా అభివర్ణించాడు. అప్పటినుంచి పత్రికలు, విలేకరులను ఫోర్త్ ఎస్టేట్ అనే మాట వాడుకలోకి వచ్చింది. 
*1780, జనవరిలో తొలి వార్తాపత్రిక బెంగాల్ గెజిట్ అనే వారపత్రికను జేమ్స్ అగస్టీన్ హిక్కీ ప్రారంభించాడు. ఈ పత్రిక హిక్కీ గెజిట్​గా ప్రసిద్ధి పొందింది. 
*వార్ హేస్టింగ్స్​కు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు హక్కీని అరెస్టు చేయడంతో 1782లో పత్రిక ప్రచురణ ఆగిపోయింది. 
*ఇండియన్ వరల్డ్ అనే పత్రికను డూనే స్థాపించాడు. ఇతనికి కారన్ వాలీస్​కు మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో డూనే ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. 
*1784లో కలకత్తా గెజిట్ అనే పత్రిక ప్రారంభమైంది. ఇదే క్రమంగా బెంగాల్ ప్రభుత్వ అధికారిక గెజిట్​గా రూపొందింది. 
 *1799లో వెల్లస్లీ కాలంలో పత్రికల మీద సెన్సార్ విధించారు. అన్ని పత్రికల సంపాదకుల పేర్లు, ముద్రకుల పేర్లను ప్రచురించాలని ఆదేశించారు. 
*1818లో లార్డ్ హేస్టింగ్స్ పత్రికలపై గల సెన్సార్​షిప్​ను తొలగించాడు. 
*తొలి ప్రాంతీయ భాషా పత్రిక బెంగాలీలో సమాచార దర్పణ్ పేరిట 1818లో స్థాపితమైంది. దీని స్థాపకులు విలియం వార్ట్, విలియం కారే, జాషువా మార్ష్మాన్. 
*భారతదేశంలో పత్రికల పరిస్థితి అంచనా వేయడానికి సర్ థామస్ మన్రోను నియమించారు. దేశంలోని ఆంగ్ల పత్రికల వల్ల ప్రమాదం లేదని భావించినా సెన్సార్ కొనసాగించాలని సూచించాడు. అతని నివేదికను అనుసరించి రెగ్యులేషన్ ఆఫ్ 1823 చట్టం చేశారు. 
*ఈ చట్టాన్ని అనుసరించి లైసెన్స్ లేకుండా ఏ పత్రికను కూడా స్థాపించరాదని, ప్రచురించిన పత్రికలు, పుస్తకాలు ప్రభుత్వానికి దాఖలు పరచుకోవాలని ఆదేశించారు. 
*1835లో చార్లెస్ మెట్​కాఫ్ గవర్నర్ జనరల్​గా నియామకమైన పత్రికలకు స్వేచ్ఛను ప్రతిపాదించాడు. ఈ చర్యను ఖండిస్తూ కంపెనీ ప్రభుత్వం మెట్​కాఫ్​​ను వెనక్కి పిలిపించింది.
*1835 నుంచి 1857 మధ్యకాలంలో భారతీయ పత్రికలు స్వేచ్ఛను అనుభవించాయి. 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా పత్రికలపై మళ్లీ ఆంక్షలు విధించారు. తిరుగుబాటు ముగియడంతో ఆంక్షలు రద్దయ్యాయి.
*ప్రాంతీయ భాషా పత్రికల చట్టం 1878 చట్టాన్ని లార్డ్ లిట్టన్ ప్రవేశపెట్టాడు. దీన్నే గాగింగ్ యాక్ట్ (నోరు నొక్కే చట్టం) అని కూడా అంటారు. 
*ఈ చట్టం ద్వారా పత్రికా యజమానులు ప్రభుత్వానికి ధరావతు చెల్లించాలి. ప్రభుత్వాన్ని విమర్శించి రాసే పత్రికలకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఇచ్చారు. 
*భారతీయ భాషా పత్రికలకు మాత్రమే ఈ షరతులు విధించడంతో శిశకుమార్ ఘోష్ స్థాపించిన అమృత బజార్ అనే బెంగాలీ పత్రిక తెల్లారేసరికి ఆంగ్ల పత్రికగా వీధుల్లో ప్రత్యక్షమైంది. 
*బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం సందర్భంగా న్యూస్ పేపర్ చట్టం 1908 ప్రవేశ పెట్టారు. దీని ఫలితంగా యుగాంతర్, సంధ్య, వందేమాతరం వంటి తీవ్రవాద పత్రికలు నిలిచిపోయాయి. 
*ఇండియన్ ప్రెస్ చట్టం – 1910 పత్రికలు చెల్లించాల్సిన ధరావతు పెంచారు. 
*ఈ చట్టం ద్వారా భారతీయ పాలకులు, న్యాయమూర్తులు, పబ్లిక్ సర్వెంట్లు రక్షణ పరిధిలోకి వచ్చారు. 
*ఇండియన్ ప్రెస్ ఆర్డినెన్స్ ఆఫ్ 1930 ద్వారా అఫెన్స్ అనే పదానికి విస్తృత అర్థం ఇచ్చారు. 
*ఇండియన్ ప్రెస్ చట్టం 1931 శాసనోల్లంఘనోద్యమాలకు సంబంధించి పత్రికల పాత్ర దెబ్బ తీయడానికి ఈ చట్టం చేశారు.