ఐఫోన్ కొన్నివ్వకుంటే కొండపైనుంచి దూకుతానని మారాం చేసిన కొడుకు.. దూకే క్రమంలో తల్లిదండ్రులు కూడా పడిపోయి ఫ్యామిలీ మొత్తం చనిపోయిన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలోని ఛత్రపతి షంభాజీనగర్ లో జరిగిన ఈ విషాద ఘటనలో తండ్రి మురళీధర్, తల్లి సంగీత, కొడుకు కునాల్ చనిపోయిన విషయం తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఘటనకు ముందు సంగీత బంధాలు, వాటి విలువపై యూట్యూబ్ ఛానెల్ లో వీడియో పోస్ట్ చేశారు. అయితే కొడుకు ఐఫోన్ విషయంలో EMI విషయంలో జరిగిన వాదన తర్వాత 200 ఫీట్ల ఎత్తున్న కొండపై నుంచి పడి 2026 ఆగస్టు 22న కుటుంబం మొత్తం చనిపోయింది.
వీడియోలో ఏ ముంది..?
ఘటనకు ముందు రికార్డు చేసిన వీడియోలో.. ప్రేమకు విలువ ఇవ్వని వ్యక్తి కోసం ఏదైనా చేయడంలో ఎలాంటి ఉపయోగం లేదు.. అంటూ పోస్ట్ చేసింది.
మిమ్మల్ని, మీ ప్రేమను విలువైనదిగా భావించే వ్యక్తి కోసం మీ అదృష్టాన్ని, విధిని సైతం అర్పించడానికి సిద్ధంగా ఉండండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని, మీ ప్రేమను విలువైనదిగా భావించకపోతే, మీరు అతని కోసం చేసేది అతనికి విలువైనది కాకపోతే, అటువంటి వ్యక్తి కోసం ఏదైనా చేయడంలో అర్థం లేదు .. అని ఒక నిమిషం వీడియోలో పేర్కొంది.
ఫ్యామిలీలో గొడవలు..
దర్యాప్తులో బయటపడిన విషయం ఏంటంటే.. కుటుంబంలో చాలా రోజులుగా డిస్ట్రబెన్సెస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆరేండ్ల క్రితం అనారోగ్యంతో పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు జరిగి.. వేర్వేరుగా ఉంటున్నట్లు తేలింది.
చపాతి రెండు వైపుల సరిగా కాలితేనే రుచిగా ఉంటుంది.. సంబంధాల విషయంలో కూడా ఇంతే. ఇద్దరి వైపు నుంచి అంతా సవ్యంగా సాగుతూ, ఇద్దరూ దానికి విలువ ఇస్తుంటే, అటువంటి సంబంధంలోనే కొనసాగాలి. లేకపోతే, ఒక వ్యక్తి దానికి విలువ ఇచ్చి, మరొకరు ఇవ్వకపోతే, అలాంటి సంబంధానికి అర్థం ఉండదు. అటువంటి సంబంధం నుంచి బయటపడటమే ఎల్లప్పుడూ మంచిది, అని వీడియోలో పేర్కొన్నారు.
యూట్యూబ్ లో సంగీత మోటివేషనల్ వీడియోలు..
యూట్యూబ్‌లో 29,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్న సంగీత, తన ఛానెల్‌లో అనేక మోటివేషనల్ వీడియోలను చేస్తూ వస్తోంది. ఆమె తన కొడుకుతో కూడిన చిన్న వ్లాగ్‌లను కూడా మెయింటైన్ చేస్తోంది.
ఆడపడుచలతో గొడవలు..
మరో వీడియోలో ఆమె మాట్లాడుతూ, ఈ రోజుల్లో ఒక వ్యక్తి అక్కాచెల్లెళ్లు తమ వదినను అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించరు అని చెప్తూ చేసిన వీడియో ఉంది. వారు ఆమె (వదిన) పిల్లల పట్ల ఎప్పుడూ ప్రేమ చూపించరు, ఆమెను నిరంతరం దూషిస్తారు, తమ సోదరుడి కుటుంబంలో మనస్పర్ధలు సృష్టిస్తారు, గొడవలకు కారణమవుతారు. వారు ఆమెను వేధిస్తారు; ఒక విధంగా, వారు తమ సోదరుడి కుటుంబాన్ని నాశనం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఒకవేళ వారు దానిని విచ్ఛిన్నం చేయలేకపోతే, అప్పుడు వారు ఆస్తిలో వాటా అడిగి ఆస్తిని తీసుకుపోతారు.. అంటూ వీడియోలో పేర్కొంది.
అక్కా చెల్లెళ్లు తమ సోదరుడి బాధల్లో అతనికి అండగా నిలబడరు. వదినను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. పైగా, వారి సోదరుడి కుమారుడు ఈ చనిపోయినప్పుడు ఆ సమయంలో వదినను, దూషిస్తారు అంటూ వీడియోలో చెప్పింది.
సంగీత చేసిన వీడియోల ఆధారంగా ఫ్యామిలీలో చాలా కాలంగా గొడవలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత భార్యభర్తలు దూరంగా ఉన్నప్పటికీ.. చిన్న కొడుకు ద్వారా వాళ్ల మధ్య కలిసీ కలవని బంధం కొనసాగుతోంది. కొడుకు ఐఫోన్ ఈఎంఐ విషయంలో వచ్చిన వాగ్వాదాల తర్వాత.. చనిపోతానని బెదిరిస్తూ కొండ దగ్గరికి వెళ్లడం.. కొడుకును కాపాడుకునే క్రమంలో పేరెంట్స్ ఇద్దరూ చనిపోవడం ఈ ఘటనలో జరిగింది.
