నీతికథ:పదవికి చదువు సరిపోదు.. తెలివిగా ప్రవర్తిస్తేనే పోటీలో గెలుస్తారు

నీతికథ:పదవికి చదువు సరిపోదు.. తెలివిగా ప్రవర్తిస్తేనే పోటీలో గెలుస్తారు

సూర్యగిరిని జయంతుడు పాలించేవాడు. అతని మంత్రి రామశర్మ. రాజు ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకునేవాడు. అన్ని గ్రామాల వృద్ధికి తోడ్పడంతో పాటు అందరికీ విద్య అబ్బేలా తగు చర్యలు తీసుకున్నాడు. పొరుగు రాజ్యాలకన్నా సూర్యగిరి గొప్పదైనదిగా తీర్దిదిద్దాలని నిరంతరం తపించేవాడు. అందుకు మంత్రి కూడా ఎంతో సహకరించేవాడు.

పొరుగు రాజ్యాలతో యుద్దాలను ఎదుర్కోవడానికి సైన్యాన్ని పెంచాడు. సైన్యాధికారికి ఎక్కువ ఒత్తిడి అవుతుందని తలచి సహాయ సైన్యాధికారి కొలువుకు ఒకరిని నియమించాలని చాటింపు వేయించాడు. ఆ పోటీకి సుమారు పాతికమంది వచ్చారు. వారిలో గురుకులాలలో బాగా శిక్షణ పొందిన పది మంది యువకులు కూడా ఉన్నారు. 

వివిధ పరీక్షల తరువాత రామయ్య, శివయ్య, చంద్రయ్య అనే ముగ్గురు మిగిలారు. వారికి చివరి పరీక్ష పెట్టి ఒకరిని ఎన్నిక చేసే బాధ్యతను మంత్రికి అప్పగించాడు రాజు.మంత్రి ఆ ముగ్గురికీ పూల తోటకు పక్కగా ఉన్న గదులను కేటాయించి రాత్రి భోజనం చేసిన తరువాత అందులో విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. 
వారు భోజనం చేసి ఆ గదులలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుండగా బయట నుండి తలుపులకు గడియ పెట్టించి తలవైపు ఉన్న కిటికీల గుండా ముందుగానే సిద్ధం చేసిన ధూపం వేసిన మట్టి పాత్రలను పెట్టించాడు మంత్రి.


కాసేపటికి మూడు గదులలో పొగ అలుముకుంది. గదిలో నిప్పు అంటుకుని ప్రమాదం జరిగిందని శివయ్య, చంద్రయ్యలు తలుపులు పగులగొట్టి బయట పడ్డారు. రామయ్య మాత్రం గది నుండి బయటకు రాలేదు. కాలి బూడిద అయిఉంటాడు అనుకున్నారు శివయ్య, చంద్రయ్యలు.తెల్లరాక తలుపులు తట్టాడు రామయ్య. గడియ తీశాడు భటుడు. 

బయటకు వచ్చిన రామయ్యను చూసి  “నీ గదిలో నిప్పు అంటుకోలేదా?” అన్నారు శివయ్య, చంద్రయ్యలు. “అది సాంబ్రాణి పొగ గదిలో దట్టంగా అలుముకుంది. పక్కనే ఉన్న కుండలోని నీళ్లతో మండుతున్న బొగ్గులను ఆర్పాను” అని చెప్పాడు రామయ్య” అయ్యో! అది సాంబ్రాణి పొగా?” అని ఆశ్చర్యపోయారు  శివయ్య, చంద్రయ్యలు.

అప్పుడు మంత్రి వచ్చి “మీరు విశ్రాంతి తీసుకుంటుండగా ధూపం వేసిన మట్టి పాత్రలను కిటికీల గుండా పెట్టించాను. ఇది కూడా పరీక్షలో ఒక భాగమే, మీ ముగ్గురి గదులలో నీటి కుండలు. వెలుగు కోసం చిన్న దీపాలు కూడా ఏర్పాటు చేయించాను. 

మీరు వెలుతురులో ఏమీ గమనించకుండా ప్రమాదం జరిగిందని తలుపులు పగులగొట్టి బయటపడ్డారు. రామయ్య ఎంతో తెలివిగా ఆ బొగ్గులను ఆర్పివేసి హాయిగా నిద్రపోయాడు. ఈ పోటీలో రామయ్యే గెలిచాడు, సహాయ సైన్యాధికారి పదవి ఆయననే వరించింది!” అని చెప్పాడు మంత్రి. శివయ్య, చంద్రయ్యలు బిక్కముఖం వేసుకున్నారు. రాజు, మంత్రిని ఎంతగానో మెచ్చుకున్నాడు.

-‌‌ యు. విజయశేఖర రెడ్డి

గమనిక: మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు featureseditor@v6velugu.com కి మెయిల్​ చేయండి.