వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా ఖిల్లాగణపురంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర రైస్‌మిల్లులో రూ.52.74 కోట్ల సీఎంఆర్ వడ్లు పక్కదారి పట్టినట్లు సివిల్ సప్లై ఆఫీసర్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీ వేంకటేశ్వర రైసు మిల్లులో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్, జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్లు శుక్ర, శనివారాల్లో తనిఖీలు నిర్వహించారు. ఒకే పేరుపై రా, బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నట్లు గుర్తించారు.
వీటిలో తనిఖీలు చేయగా 3,49,375 బస్తాల వడ్లు తేడా ఉన్నట్లు గుర్తించారు. బాయిల్డ్ మిల్లులో రూ.31 కోట్లు, రా రైస్ మిల్లులో రూ.21 కోట్లతో కలిపి రూ.52.74 కోట్ల విలువైన వడ్లు పక్కదారి పట్టినట్లు తేలింది. సివిల్ సప్లై ఆఫీసర్ల ఫిర్యాదుతో మిల్లుల ఓనర్ శ్రీదేవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పోలీసుల అదుపులో రైస్ మిల్లర్!
జనగామ జిల్లా పోలీసులు యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన రైస్ మిల్లర్ నూనె వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. భువనగిరికి చెందిన రైస్ మిల్లర్ నూనె వెంకటేశ్వర్లు జనగామ జిల్లా నెల్లుట్లలోని మణికంఠ మిల్లులో పార్టనర్‌గా ఉన్నాడు. 2022-23 యాక్షన్ ప్యాడీ, 2024-–25 సీజన్లో 995 టన్నులకు పైగా వడ్లకు సంబంధించిన రూ.7 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఇటీవల మిల్లులో తనిఖీలు నిర్వహించగా స్టాక్ కన్పించలేదు. దీంతో ఆ మిల్లుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాటికి రిప్లైఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
మిల్లు పార్టనర్లు అందుబాటులో లేకపోవడంతో వెంకటేశ్వర్లును శనివారం రాత్రి తీసుకెళ్లారు. అతడిని జనగామ జిల్లా లింగాల ఘనపురం పోలీసులు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయాన్ని జనగామ పోలీసులు ధృవీకరించలేదు. ఇదిలా ఉంటే ఇటీవల భువనగిరి మండలం అనంతారం మిల్లులో రూ.24 కోట్ల ఫ్రాడ్ జరగడంతో పోలీసులు అరెస్ట్ చేయగా, బెయిల్‌పై విడుదలయ్యాడు.
గోదాంలో వడ్లు మాయం!
నల్గొండ జిల్లా చండూరు మార్కెట్ యార్డు గోదాంలో గత నెల ఒకటిన 300 బస్తాల వడ్లు మాయమయ్యాయి. సీఎంఆర్ కోసం మహావీర్ రైస్ మిల్లుకు వడ్లు కేటాయించగా, మిల్లులో స్థలం లేకపోవడంతో సివిల్ సప్లై అధికారుల అనుమతితో 3 నెలల కింద మిల్లర్ వడ్లను మార్కెట్ యార్డు గోదాంలో నిల్వ చేశాడు. జులై 1న గోదాం తెరిచి చూడగా 300 బస్తాల వడ్లు కనిపించలేదు.
దీంతో మిల్లు యజమాని మార్కెట్ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా, పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పి చేతులు దులుపుకున్నాడు. తాజాగా గోదాం తెరిచి చూడగా మరింత ధాన్యం మాయమైనట్లు గుర్తించాడు. వడ్లు మాయం వెనక ఉన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మిల్లర్ డిమాండ్ చేస్తున్నాడు. మాయమైన వడ్లను రికవరీ చేయాలని కోరుతున్నాడు.
