హైదరాబాద్ పబ్లిక్కు గుడ్ న్యూస్.. నాగార్జున సాగర్లోకి భారీగా వరద.. తాగునీళ్లకు బేఫికర్

హైదరాబాద్ పబ్లిక్కు గుడ్ న్యూస్.. నాగార్జున సాగర్లోకి భారీగా వరద.. తాగునీళ్లకు బేఫికర్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: జంట నగరాలకు తాగునీటిని అందిస్తున్న ప్రధాన జలాశయమైన నాగార్జున సాగర్​కు వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం నుంచి నీటిని వదులుతుండడంతో సాగర్​లోకి వరద పోటెత్తుతోంది. దీంతో వాటర్​బోర్డుకు కష్టాలు తప్పాయి.

వర్షాలు పడక సాగర్​ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, వర్షాలు సరిగ్గా కురవక రెండు వారాల క్రితం 513 అడుగులకు చేరుకుంది. 510 అడుగులకు చేరుకుంటే పంపింగ్​చేసి నీటిని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు బోర్డు కూడా సిద్ధమైంది.

అయితే, కొద్ది రోజుల నుంచి వర్షాలు పడుతుండడం, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో సాగర్​ లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం 532 అడుగులకు చేరింది. అలాగే కొద్ది రోజుల కింద 136 టీఎంసీల నీళ్లుండగా ఇప్పుడు 176.05 టీఎంసీలకు చేరుకుంది. ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉండడంతో పంపింగ్​బాధ తప్పినట్టయ్యింది. 

‘సాగర్’ ​నుంచి లోటు భర్తీ
కృష్ణా ప్రాజెక్టు 3 దశల ద్వారా నగరానికి రోజుకు 270 ఎంజీడీలను సరఫరా చేస్తున్నారు. అలాగే, సింగూరు రిపేర్ల నేపథ్యంలో 29 టీఎంసీల కెపాసిటీ ఉన్నా కూడా 4.181 టీఎంసీలు మాత్రమే మెయింటెయిన్​చేస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి రోజుకు 69 ఎంజీడీలు డ్రా చేసే అవకాశమున్నా కొంత తగ్గించారు.

ప్రస్తుతం ఉన్న నిల్వలు 4 నెలలకు సరిపోయే అవకాశం ఉండడంతో, ఆ తర్వాత జీరో లెవెల్​గానే కొనసాగించి రిపేర్లు చేసే అవకాశం ఉంది. అప్పుడు ఏర్పడే లోటును కృష్ణా ప్రాజెక్టు నుంచి 25 ఎంజీడీలు అదనంగా తీసుకోవడం ద్వారా భర్తీ చేయాలని చూస్తున్నారు.