ఆధ్యాత్మికం: ప్రపంచం ఎలా పుట్టింది.. ఎవరి వల్ల .. ఎలా వచ్చింది.. సృష్టి అంటే ఏమిటి..పుట్టు పూర్వోత్తరాలు ఇవే..!

ఆధ్యాత్మికం:  ప్రపంచం  ఎలా పుట్టింది.. ఎవరి వల్ల .. ఎలా వచ్చింది.. సృష్టి  అంటే ఏమిటి..పుట్టు పూర్వోత్తరాలు ఇవే..!

 ఋగ్వేదంలోను, ఉపనిషత్తులలోను, దర్శనాలలోను, త్రిమత సిద్ధాంతాలలోను సృష్టిని గురించిన విచారణ విస్తారంగానే ఉంది. ఈ విశ్వం ఎక్కడ నుండి వచ్చింది? ఎలా వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? ఎంతకాలం ఉంటుంది? మొదలైన ప్రశ్నలకు  కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. కాకపోతే, ఇవన్నీ ఏ నిర్దిష్టమైన సిద్ధాంతాన్నీ ఆవిష్కరించలేదు. అయితే, విశ్వసృష్టి  మీద వేల సంవత్సరాల క్రితం భారతీయ చింతన దృష్టి సారించడమే ఒక విశేషం. 

 ఐతరేయ ఉపనిషత్తులో సృష్టిక్రమం ఇలా వర్ణించబడింది...


‘స ఇమాన్లోకానసృజత: అమ్భోమరీచీర్మరమాపోదో
మ్భ: పరేణ దివం ద్యౌ: ప్రతిష్ఠా‚న్తరిక్షం మరీచయ:
పృథివీ మరో యా అధస్తాత్తా ఆప: 

సృష్టి అంటే ఇదేదో కొత్తగా జరిగే మొదటి సృష్టి అనుకోకూడదు. సృష్టి స్థితి లయాలు వృత్తాకార పద్ధతిలో మరల మరల ఆవృత్తమవుతూనే ఉంటాయి. అందువల్లే సృష్టి అనాది. ఇంతకు ముందటి సృష్టి లయకాలంలో ప్రళయం వచ్చి, అంతం అయిపోతుంది. ఆ ప్రళయ సమయం తీరిపోయి, పూర్వపు సృష్టిలోని జీవజాలం వాసనలకు అనుగుణమైన లోకాల సృష్టి జరుగుతుంది. 

విశ్వాన్ని సృష్టించాలని ఆత్మ ఆలోచించిందనడంలో అర్థం పూర్వోక్త వాసనలు ప్రధానాన్ని ప్రేరేపించగా, సృష్టికర్త  చైతన్యాన్ని ఇచ్చి సృష్టి కార్యానికి దోహదపడ్డాయని ఆలోచించి అంభస్సు, మరీచి, మరం, జలం అనే లోకాలను సృష్టించాడు.

బ్రహ్మ  నుండి ఈ విశ్వం ఆవిర్భవించింది. అయితే ఈ సృష్టికి ప్రేరణ ఏమిటి..  తపస్సుతో బ్రహ్మం ఒకటిగా ఉన్న నేను బహురూపాలతో ఆవిర్భవిస్తాను’ అనుకున్నాడు. అంటే, ఆ బ్రహ్మం ఇచ్ఛామాత్రంతోనే సృష్టి జరిగిందని అర్థం చేసుకోవాలి. అలా సంకల్పించుకున్న బ్రహ్మం నుండి మొదట అన్నం పుట్టింది. 

ఇక్కడ అన్నం అంటే మనకు ఆహారంగా ఉన్న అన్నం అని అనుకోకూడదు. అన్నం అంటే ప్రకృతి (ఆదిమద్రవ్యం ) అని అర్థం. దానిలోనే సత్య, తమో, రజో గుణాలు నిక్షిప్తమై ఉంటాయి. ఆ ప్రకృతి నుండి హిరణ్యగర్భుడు ఆవిర్భవించాడు. ఆయన నుండి మనస్సు ( సమష్టి రూపమైన మనస్సు ... ఆ మనస్సు నుండి పంచభూతాలు (ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథ్వి).. వాటినుండి జగత్తు ఉద్భవించాయి.

‘అనీదవాతం స్వధయా తదేకం తస్మాద్ధాన్యన్న పర: కిం చనాస’ 

‘సృష్టికి పూర్వంభగవంతుడు తప్ప మరెవ్వరూ లేరని ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది. ఆయన తనంతట తానే శ్వాస తీసుకోవడం మొదలుపెట్టాడని  ఋగ్వేదంలోని నాసదీయ సూక్తంలో... సృష్టికి పూర్వం ఉండే స్థితిని గురించి రుషులు వివరించారు

వేదాల్లోని పురుషసూక్తం ప్రకారం పరమాత్మ మనస్సు నుండి చంద్రుడు, చక్షువుల  (కన్నుల)నుండి సూర్యుడు ఉద్భవించారని’ సృష్టిక్రమాన్ని వర్ణించింది. మొదట జన్మించిన వాడు హిరణ్యగర్భుడని, ఆయనే భగవంతుడని, ఆయనే విశ్వానికి అధిపతి అని ‘హిరణ్యగర్భసూక్తం’ ద్వారా తెలుస్తుంది. 

ఈ విషయం గురించి  తైత్తిరీయ ఉపనిషత్తులో కొంత స్పష్టత కనిపిస్తుంది. ‘సో‚కామయత బహుస్యాం ప్రజాయేయేతి’ ఒకటిగా ఉన్న నేను అనేకములుగా అవుతాను. నన్ను నేనే పుట్టించుకొనెదను అని సంకల్పించుకొని ఆ అవ్యాకృతంగా వున్న బ్రహ్మం ‘తదాత్మానగ్గం స్వయమకురుత’ తనకు తానే ఈ నామరూపాత్మకమైన విశ్వంగా మారాడని పండితులు చెబుతున్నారు.  

ఉపనిషత్తులలో విశ్వం మారే క్రమాన్ని  వివరించింది. 

‘తస్మాద్వా ఏతస్మాదా త్మన ఆకాశ స్సంభూత: ఆకాశాద్వాయు: వాయోరగ్ని: అగ్నేరాప: అద్భ్యాపృథివీ: పృథివ్యా ఓషధయ: ఓషధీభ్యోన్నమ్‌ అన్నాత్పురుష:’ 

బ్రహ్మం నుండి ఆకాశం, దాని నుండి వాయువు, దాని నుండి నీరు, దాని నుండి భూమి, దాని నుండి మొక్కలు, వాటి నుండి అన్నం, దాని నుండి పురుషుడు లేక జీవజాలం పుట్టిందని హృద్యంగా వివరించబడింది.

 ఆకాశం జడమైంది. దానికి సృష్టించే శక్తి లేదు. మరి, దాని నుండి జలం ఎలా వచ్చిందనే సందేహం వస్తుంది. బ్రహ్మ ఆకాశాన్ని సృష్టించినప్పుడు దానిలో బ్రహ్మం అనే పదార్దం  నిక్షిప్తంగా ఉంటుంది. అలా ప్రతి వస్తువులోనూ ఉంటుంది. 

బయటా, లోపలా ఉండేది బ్రహ్మం అని వేదాల ద్వారా తెలుస్తుంది.  అంతర్హితంగా, అన్నింటిలోనూ బ్రహ్మం ఉంటూనే ఒకదాని నుండి మరొక దానిని సృష్టిస్తుంది. ఈ నామరూపాత్మకమైన సృష్టికి ఆదిమధ్యాంతాలు ఉన్నాయి . కాని  అద్వైతులు, మన కంటికి కనిపిస్తున్న దానిని ..  మనం వ్యవహరిస్తున్న ప్రపంచాన్ని మిథ్య అనరాదని, అది నిజమేనని విశిష్టాద్వైతులు, ద్వైతులు అంటారు. పరమాత్మతో సృష్టించబడ్డ విశ్వాన్ని మిథ్య అనడం తప్పని కొంతమంది వాదిస్తుంటారు.

 ఒక సిద్ధాంతంగా చెప్పాలంటే... సాలెపురుగు నుండి దారాలు  వచ్చి మళ్లీ దానిలోకే ఎలా వెళ్లిపోతున్నాయో  బ్రహ్మం నుండి విశ్వం ఉద్భవించి మళ్లీ బ్రహ్మంలోనే లయం అవుతుందని ‘ముండకోపనిషత్తు’ చెప్తున్నది. 

జైనులు విశ్వం అణువులతో ఏర్పడిందని అన్నారు. ఎవ్వరి ప్రమేయం లేకుండా విత్తనం చెట్టుగా ఎలా మారుతుందో, గుడ్డు పిల్లగా ఎలా మారుతుందో.. అలాగే, ఈశ్వరుని ప్రమేయం లేకుండానే విశ్వం ఆవిర్భవించిందని కొంతమంది  చెబుతున్నారు. కాని పురాణాల ప్రకారం రుషులు అణు సిద్ధాంతానికి కొనసాగింపుగానే సృష్టి క్రమాన్ని వివరించారు. 

బ్రహ్మ పదవీకాలం అయిపోయిన వెంటనే పరమేశ్వరుడు జీవులకు విశ్రాంతి నివ్వాలనుకుంటాడు. వెంటనే జీవులలో అదృష్టశక్తిని ఉపసంహరిస్తాడు. ఆ కారణంగానే  పదార్థాలలోని అణువులు వియోగం చెంది పదార్థాలు శిథిలమవుతాయి. మహాభూతాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు కూడా నశించి పరమేశ్వరునిలో ఐక్యమవుతాయి.

విడివిడిగా అణువులు, పుణ్యపాపాలతో కూడిన జీవులు, నిద్రాణంగా ఉంటాయి.‘అదృష్టవదాత్మ సంయోగాదేవ సర్గాదౌ పరమాణూనాం కర్మ’  ఆత్మకు, జీవులకు పూర్వజన్మతోగల సంయోగ కారణంగా అణువులలో కర్మానుగుణంగా స్పందన కలుగుతుంది. 

అప్పుడు జీవుల కర్మానుభవం కోసం మళ్లీ పరమేశ్వరుడు అణువులలో చలనాన్ని కలిగించి, మహాభూతాలను సృష్టించి, సృష్టికార్యం ప్రారంభిస్తే దానిని బ్రహ్మదేవుడు పూర్తి చేస్తాడు. పరమేశ్వరుడే సృష్టికి నిమిత్త కారణం. బ్రహ్మదేవుడు సృష్టిలో ఉత్తముడు. బ్రహ్మకూడా ఆ పదవిని తన పుణ్యంతోనే పొందాడు. ఆ పుణ్యం క్షయం కాగానే, తనతోపాటు సృష్టికూడా లయం అవుతుంది.

మరొకరు బ్రహ్మ  పదవిని అలంకరిస్తాడు. ఇలా ప్రతి సృష్టికీ ఒక బ్రహ్మ ఉంటాడు. ఇలా సృష్టిని గురించి భారతీయ చింతన ఉపనిషత్తులలో ఏ విధంగా ఉన్నా పరమాత్మ సృష్టికర్త అనే భావంతో అన్నీ అంగీకరించాయి. 

ఎప్పుడైతే జగత్తు పుట్టిందో అప్పుడే జీవులు, కర్మలు వాటిని అనుభవించడం మొదలైంది. ఈ అక్షర పరబ్రహ్మమే సృష్టికి కారణం. ప్రాణం, మనస్సు, సర్వేంద్రియాలు, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథ్వి ఇవన్నీ అక్షర పరబ్రహ్మం నుండి పుట్టినవే. ప్రాణం కూడా దీనినుండే ఉద్భవించిందంటే, అంతకు ముందు ప్రాణం అనేది లేదన్న మాటే కదా. అంటే, అక్షర పరబ్రహ్మానికి ప్రాణం ఆపాదించకూడదు. 

ఒక్క ముక్కలో చెప్పాలంటే, నామరూపాత్మకమైన ఈ విశ్వం అంతా ఆ బ్రహ్మం నుండే వచ్చింది. అందువల్ల ఆ బ్రహ్మాన్ని ఉపాదాన కారణం  అన్నారు. భారతీయ తత్వశాస్త్రంలో బ్రహ్మం నుండి విశ్వం ఆవిర్భవించింది ) అంటారు. తాబేలు నుండి అవయవాలు ఎలా బయటికి వస్తాయో అలాగే. మళ్లీ అవయవాలను తాబేలు లోపలికి తీసుకున్నట్లే ప్రళయకాలంలో విశ్వాన్ని బ్రహ్మం తన లోపలికి తీసుకుంటుంది లేదా తనలో లయం చేసుకుంటుంది.

ఐతరేయ ఉపనిషత్తు సృష్టికి పూర్వం ఉన్న పరిస్థితిని గురించి మూడు విషయాలను చెప్పింది.

  • ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్: సృష్టికి పూర్వం ఉన్నది ఆత్మ మాత్రమే.
  • నాన్యత్కించన మిషత్: కార్యకలాపాలు చేసే ఇతర వస్తువు ఏదీ లేదు.
  • స ఈక్షత లోకాన్ను సృజాఇతి: విశ్వసృష్టి చేద్దామని ఆ ఆత్మ సంకల్పించింది లేదా ఆలోచించింది. 

ఇదంతా ఐతరేయ ఉపనిషత్తులోని సృష్టిక్రమం. ఇలా సృష్టి కార్యాన్ని మన ఉపనిషత్తులు వర్ణించాయి.   

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.