బొజ్జ గణపయ్యకు పద్య నీరాజనం.. వినాయకుని కథ పాదాలు, గణాలు, యతి, ప్రాసకు కొలమానాలు

బొజ్జ గణపయ్యకు పద్య నీరాజనం..  వినాయకుని కథ  పాదాలు, గణాలు, యతి, ప్రాసకు కొలమానాలు

తెలుగు సాహిత్యంలో పద్య రచన క్లిష్టమైన ప్రక్రియ. ఇందులో పాదాలు, గణాలు, యతి, ప్రాస వంటి కొలమానాలు ఉంటాయి. ఈ లక్షణాలన్నీ పొందుపరుస్తూ పద్యాలు రచించడం అంత ఈజీ కాదు. అందుకే ప్రస్తుతం పద్య సాహిత్యం అడపాదడపా మాత్రమే కనిపిస్తోంది. ఈ కోవలో ఇటీవల వచ్చిన పుస్తకమే ‘శ్రీవినాయక వ్రత కథా శతకము’. డాక్టర్ గోపావఝుల భవానీ కృష్ణమూర్తి రాసిన ఈ పుస్తకం 117 పద్యాల శతకం.      

‘శ్రీవినాయక వ్రత కథా శతకము’ పుస్తకం భక్తి, పురాణం, ఆధ్యాత్మికత కలగలిసిన రచన. ఇందులో వినాయక వ్రత కల్పంతోపాటు, గణేశ పంచరత్నం, ఋణవిమోచన స్తవం, శ్రీగణపత్యథర్వశీర్షోపనిషత్ పొందుపరిచారు. అలాగే  గణేశుని మహిమలు, ముఖ్యమైన ఆలయాలు, వాటి చరిత్రలను పద్య రూపంలో ఛందోబద్ధంగా వివరించారు. లంబోదరుని జననం, గజముఖ రూపం, గణాలకు అధిపతి కావడం, చంద్రునికి పార్వతీదేవి శాపం, నీలాపనిందలు, శమంతకోపాఖ్యానం తదితర ప్రధానాంశాలన్నీ అందంగా ఆటవెలది, తేటగీతి పద్యాల్లో అక్షరబద్ధం చేశారు.  

వినాయక వ్రత కథను కేవలం ఆచార పద్ధతుల వివరణగా మాత్రమే కాకుండా, భక్తి విశ్వాసాలకు, సత్ప్రవర్తనకు, ధర్మనిష్ఠకు మార్గదర్శకంగా ఈ శతకాన్ని మలిచారు. అహంకారం, అవివేకం, దురాశ వంటి దుర్గుణాలను విడిచిపెట్టి, వినయం, విశ్వాసం, దైవభక్తి, సత్యనిష్ఠ వంటి సద్గుణాలను అలవరచుకోవాలనే సందేశం అంతర్లీనంగా  వ్యక్తపరిచారు. అలాగే, ఆధునిక కాలంలోనూ మన సనాతన సంప్రదాయాలు, పండుగలు, వ్రతాల అంతరార్థం ప్రజలకు చేరువ కావాలనే రచయిత్రి ఆలోచనకు ఈ శతకం ప్రతిరూపంలా ఉంది. 

శతకానికి ఛందస్సు ఎంత ముఖ్యమో  మకుటం అంతే ప్రధానం. ఇది శతకానికి ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. అందులోని అర్థాన్ని లయబద్ధంగా, భావయుక్తంగా పాఠకునికి అందించడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. ఈ శతకంలోనూ ప్రతి పద్యం చివరి పాదంలో కనిపించే‘భక్తవరద’ మకుటం ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించింది. పద్య రచనలో సంస్కృత పదబంధాలతోపాటు సులభమైన తెలుగునూ వాడడంతో సామాన్య పాఠకులకు సైతం అర్థమయ్యేలా ఉంది.  

వినాయక వ్రతానికి సంబంధించిన ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని, వ్రతాచరణ వెనుక ఉన్న ధార్మిక భావనలను అతి కొద్ది పద్యాల్లోనే ఈ రచన అద్భుతంగా ఒడిసిపట్టింది. భక్తి భావాన్ని ప్రధానంగా చేసుకొని ధార్మిక, నైతిక, ఆధ్యాత్మిక సందేశాలను పాఠకుల హృదయానికి చేరేలా మలచడం ప్రశంసనీయం. ఈ శతకం బొజ్జ గణపయ్యకు పద్య నీరాజనం. దీనిని అందరూ చదవొచ్చు. 

  - జి. మహేశ్వర్

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ featureseditor@v6velugu.com