- వివాదానికి దారి తీసిన రూ.600 కోట్ల ఫండ్స్ డీపీఆర్ కాంట్రాక్ట్
- ఎమ్మెల్యే ఆదేశించినా బేఖాతర్ ?
భద్రాద్రి కొత్తగూడెం,వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.600 కోట్ల నిధుల ప్రతిపాదనల చుట్టూ కమిషన్ల ఆరోపణలు ముదురుతున్నాయి. ఈ నిధులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం హైదరాబాద్‌కు చెందిన ఓ కన్సల్టెంట్ సంస్థతో కార్పొరేషన్ అధికారులు రూ.9.60 కోట్లకు ఒప్పందం చేసుకోవడం వివాదానికి దారితీసింది.
భారీగా కమిషన్లు దండుకుని ఈ కాంట్రాక్ట్ ఖరారు చేశారంటూ పలువురు కార్పొరేటర్లు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెరో 25 శాతం నిధులు సమకూరిస్తే, మిగిలిన 50 శాతం నిధులు జర్మన్ బ్యాంకు ద్వారా రుణంగా తీసుకుని కార్పొరేషన్ సమగ్రాభివృద్ధికి సుమారు రూ.600 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు.
ఈ పనులకు సంబంధించి డీపీఆర్ రూపొందించేందుకు కన్సల్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే ఓ కన్సల్టెంట్ తన సంస్థ పేరుతో పాటు బినామీ పేరుతో మరో టెండర్ దాఖలు చేసిందని, అధికారులు అదే సంస్థకు రూ.9.60 కోట్లకు కాంట్రాక్ట్ ఖరారు చేయడం అనుమానాలకు తావిచ్చింది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం, కౌన్సిల్‌కు పూర్తి సమాచారం ఇవ్వకుండానే కాంట్రాక్ట్ ఖరారు చేయడంపై పలువురు కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కమీషన్ల కోసమే పనుల ప్రతిపాదనలా ?
ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కార్పొరేషన్‌కు అవసరం లేని పనులను డీపీఆర్‌లో చేర్చడం వెనుక కమిషన్ల వ్యవహారం ఉందని కార్పొరేటర్లు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అధునాతన బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్, డిజిటల్ లైబ్రరీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి పనులకు రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని ఈ పనులు ప్రస్తుతానికి అవసరం లేదని కార్పొరేటర్లు అంటున్నారు.
ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్ ?
డీపీఆర్ తయారీకి కన్సల్టెంట్ ఎంపికపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి, ఆన్‌లైన్‌లో టెండర్లు పిలవాలని ఆఫీసర్లను ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే ఆదేశాలు వెలువడి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కాంట్రాక్ట్ రద్దు చేయలేదు. దీంతో ఎమ్మెల్యే ఆదేశాలు అమలవుతాయా? లేక ప్రస్తుత డీపీఆర్ కాంట్రాక్ట్ కొనసాగుతుందా? అనే చర్చ కార్పొరేషన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
