బంగ్లాదేశ్లో మరోసారి దారుణ ఘటన జరిగింది. ఒక రిటైర్డ్ హిందూ టీచర్ను, అతని కుటుంబాన్ని గొంతు నులిమి చంపేశారు. శనివారం రాత్రి పొద్దుపోయాక రంగపూర్లో తాళం వేసి ఉన్న ఇంట్లో ఒక రిటైర్డ్ టీచర్, అతని భార్య, కూతురు, 12 ఏళ్ల వయసున్న కొడుకు విగత జీవులుగా కనిపించారు. ఆ కుటుంబాన్ని గొంతు నులిమి చంపి ఉండొచ్చని మృతదేహాలను పరిశీలించాక.. ఒంటిపై ఉన్న గుర్తుల ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
రంగపూర్ మెట్రోపాలిటన్ కోత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి నజ్ముల్ ఖాదర్.. రాత్రి 11.30 గంటల సమయంలో మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను రంగపూర్ జిల్లా పాఠశాలలో పనిచేసిన రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి (65), అతని భార్య ప్రీతిలత చక్రవర్తి (50), కూతురు అగామి చక్రవర్తి ప్రార్థి (23), కొడుకు ప్రియం చక్రవర్తి (12)గా పోలీసులు గుర్తించారు.
రంగపూర్ మెట్రోపాలిటన్ సీఐడీ ఇన్‌చార్జి సుబీర్ చౌదరి మాట్లాడుతూ.. ప్రీతిలత, అగామిల మృతదేహాలు మెట్లపై కనిపించాయని, గణపతి మృతదేహం ఇంటి మేడపై కనిపించిందని చెప్పారు. ప్రియం మృతదేహం మంచం కింద దొరికింది. ఈ హత్యలు గురువారం అర్ధరాత్రి గానీ, శుక్రవారం తెల్లవారుజాము మధ్య జరిగి ఉండవచ్చని ఆయన తెలిపారు.
ఈ హత్యలకు సంబంధించి ముగ్ధో, సిద్ధార్థ అనే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమ ఇంటి మేడపై అనుమానితులు యబా అనే చట్టవిరుద్ధమైన, అత్యంత వ్యసనకరమైన సింథటిక్ డ్రగ్‌ను తీసుకుంటుండగా ఈ కుటుంబం చూసి అభ్యంతరం తెలిపింది. తమ ఇంటి మేడ మీదకు దూకి ఇలా డ్రగ్స్ తీసుకోవడం ఏంటని నిలదీసింది. ఈ సమయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకునే ఈ కుటుంబాన్ని టార్గెట్ చేసి చంపేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం.. రంగపూర్ మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ మహమ్మద్ అబ్దుల్ మబూద్ ఆదివారం మాట్లాడుతూ.. ఇద్దరు అనుమానితులు పక్క బిల్డింగ్ మీదుగా గణపతి చక్రవర్తి ఇంటి మీదకు దూకి యాబా అనే డ్రగ్ తీసుకుంటున్నారు. తాము మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న సంగతి ఈ కుటుంబం ఎక్కడ బయటపెడుతుందోననే భయంతోనే అనుమానితులు గణపతిని, అతని కుటుంబాన్ని హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.
గణపతి పోయిన ఏడాది డిసెంబర్ 31న రంగపూర్ జిల్లా పాఠశాల నుంచి పదవీ విరమణ పొందారు. ఆయన కూతురు ఈ సంవత్సరం రంగపూర్ కార్మైకేల్ కళాశాల నుంచి ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. గణపతి కొడుకు రంగపూర్ జిల్లా పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. గణపతికి శత్రువులు ఎవరూ లేరని ఆయన మేనకోడలు సోమ చక్రవర్తి చెప్పారు.
పదవీ విరమణ తర్వాత ఆయన హోమియోపతి వైద్యుడిగా పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ ఫ్యామిలీ సుమారు నాలుగేళ్లు నుంచి ఆ ఏరియాలో ఉంటుందని స్థానికులు చెప్పారు. గణపతి మూడు అంతస్తుల ఇంటిని నిర్మించినప్పటికీ, నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
