హార్మూజ్‌‌లో నౌకపై క్షిపణి దాడి.. 11 మంది ఇండియన్లకు గాయాలు

హార్మూజ్‌‌లో నౌకపై క్షిపణి దాడి.. 11 మంది ఇండియన్లకు గాయాలు

న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధి గుండా పనామా జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై మంగళవారం క్షిపణి దాడి జరిగింది. ఈ దాడితో నౌకలో ఉన్న 11 మంది భారతీయ సిబ్బంది గాయపడ్డారు. వాణిజ్య నౌకపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ‘ఎంటీ ఆన్ పీస్’ అనే ఈ నౌకలో 17 మంది భారతీయులతో సహా మొత్తం 19 మంది సిబ్బంది ఉన్నారని.. దాడి కారణంగా 12 మంది గాయపడగా, వారిలో11 మంది భారతీయులు ఉన్నారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

నౌక ఒమన్ తీరానికి సమీపంలో హర్మూజ్‌‌ గుండా వెళ్తుండగా దాడి జరిగినట్టు తెలిపింది. ఒమన్ అధికారుల సహాయంతో నౌకలోని నావికులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పేర్కొంది. గాయపడినవారికి ప్రస్తుతం ఒమన్‌‌లోని ఖసాబ్‌‌లో వైద్య చికిత్స అందుతోందని తెలిపింది.

 కాగా, హార్మూజ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల పరంపర భారత్‌‌కు ‘తీవ్ర ఆందోళన కలిగించే విషయం’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం ఇలాంటి దాడులను వెంటనే నిలిపివేయాలని మరోసారి విజ్ఞప్తి చేసింది.