వాషింగ్టన్ / జెనీవా: రష్యాలో ప్లేగు వ్యాధి వ్యాప్తిపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో వ్యాధి నివారణలో సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రష్యాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో ప్లేగు వ్యాధి రీసెర్చ్ ల్యాబ్‌కు చెందిన ఉద్యోగి ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించారన్న వార్తల నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘‘ఇలాంటి సమస్య ఎవరికి వచ్చినా సహాయం చేసేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. రష్యా నుంచి పొంచి ఉన్న వ్యాధి వ్యాప్తి ముప్పును ఎదుర్కోవడంపై అలర్ట్‌గానే ఉన్నాం” అని చెప్పారు. ఈ వ్యాధిని ‘ప్లేగు నిమోనియా’గా అభివర్ణించిన ట్రంప్, ఇది ఒక క్లిష్టమైన వ్యాధి అని పేర్కొన్నారు. మైక్రోబ్‌లు మరింత బలంగా, తెలివిగా మారుతున్నాయని, అవి ఒక సైన్యంలా తయారవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, రష్యాలో ఒక ల్యాబ్ ఉద్యోగికి సోకినట్లు అనుమానిస్తున్న ప్లేగు ఇన్ఫెక్షన్‌పై నిఘా పెట్టామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఈ వ్యాధి దేశీయంగా అంతర్గతంగా మరింత విస్తరించి ఉండొచ్చనే ఆందోళనల నడుమ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
అయితే, ఈ వ్యాధి విషయంలో రష్యా అధికారుల నుంచి అందిన సమాచారం మాత్రమే తమ వద్ద ఉందన్నారు. ఎంత మందికి వ్యాధి సోకింది..? దాని వ్యాప్తి ఎంత మేరకు ఉందన్న వివరాలు అందాయా..? లేదా..? అన్నది ఆయన వెల్లడించలేదు. కానీ, అమెరికాలోకి వ్యాధి వ్యాప్తి చెందకుండా క్వారంటైన్ చర్యలు కూడా తీసుకున్నట్లు తెలిపారు.
‘‘అమెరికా, రష్యా మధ్య ప్రయాణాలు ప్రస్తుతం చాలా పరిమితంగానే ఉన్నాయి. అయినప్పటికీ ఇలాంటివి ఒకచోటి నుంచి ఇంకో చోటికి చేరితే చాలా త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది” అని రూబియో ఆందోళన వ్యక్తం చేశారు.
ప్లేగు వ్యాప్తి ప్రమాదం తక్కువే: డబ్ల్యూహెచ్‌వో
రష్యా సైబీరియాలోని ఒక ప్లేగు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసిన దర్యా షిపిలోవా అనే మహిళా ల్యాబ్ టెక్నీషియన్ మరణంతో ఆందోళనల నేపథ్యంలో దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మంగళవారం స్పందించింది. రష్యాలో ఈ అంటువ్యాధి వ్యాప్తి ముప్పు చాలా తక్కువగానే ఉందని స్పష్టం చేసింది. షిపిలోవా గత వారం మృతి చెందిన తర్వాత ఇప్పటివరకు వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందిన సంకేతాలు కనిపించలేదని వెల్లడించింది.
‘‘షిపిలోవాను కలిసిన అందరినీ గుర్తించామని, వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నామని సమాచారం అందింది. నేటి వరకు ఎవరిలోనూ అనారోగ్య లక్షణాలు కనిపించలేదు” అని ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మీయర్ పేర్కొన్నారు. ‘‘వైరల్ నిమోనిక్ ప్లేగు కారణంగానే షిపిలోవా మరణించారా అనే దానిపై రష్యా అధికారులు ఇంకా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఇర్కుట్స్క్ ప్రాంతానికి ప్లేగు ముప్పు ‘మోస్తరు నుంచి తక్కువగా’, రష్యాలోని మిగిలిన ప్రాంతాలకు ‘తక్కువగా, ఐరోపాకు ‘చాలా తక్కువగా’ ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసిందన్నారు.
