అబుదాబి: ఫ్లైదుబాయ్ ఘటనలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై కీలక విషయాలు బయటకొచ్చాయి. కో-పైలట్ చేసిన దాడిలో మచ్చర్‌కు డిప్రెస్డ్ స్కల్ ఫ్రాక్చర్ అయినట్లు ఎన్డీటీవీ వర్గాలు తెలిపాయి. పుర్రె పగిలి దాని ఎముక భాగం మెదడు వైపునకు చొచ్చుకుపోయినట్లు వెల్లడించాయి. డిప్రెస్డ్ స్కల్ ఫ్రాక్చర్ అంటే పుర్రె ఎముక పగిలి లోపలికి మెదడుపై ఒత్తిడి తెస్తుందని, ఇది అత్యంత ప్రమాదకరమైన గాయమని వైద్య నిపుణులు తెలిపారు.
సౌదీ అరేబియాలోనే వైద్యులు ఆయన తలకు ఎమర్జెన్సీ సర్జరీ చేసినట్లు వెల్లడించారు. ఆపరేషన్‌లో భాగంగా పుర్రెను రీకన్‌స్ట్రక్ట్ చేసినట్లు పేర్కొన్నారు. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి కాక్‌పిట్ లోని గొడ్డలితో మచ్చర్‌పై హత్యాప్రయత్నానికి పాల్పడ్డాడు.ఈ దాడిలో పైలట్‌కు కాళ్లు, చేతులు, ఛాతీ, ఉదర భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ మచ్చర్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తన ప్రాణాలను లెక్కచేయకుండా సాహసంతో పోరాడి కాక్‌పిట్ తలుపు తెరుచారు. దీంతో విమానాన్ని కూల్చాలని ప్రయత్నించిన కో-పైలట్‌ను ప్రయాణికులు, సిబ్బంది అడ్డుకోగలిగారు. దాడి తర్వాత విమానం సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. వెంటనే అక్కడి ఆసుపత్రికి తరలించగా, సౌదీ వైద్యులు మచ్చర్‌కు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేశారు.
యూఏఈకి తీసుకువచ్చే ముందే ఆయన పుర్రెను అత్యంత నైపుణ్యంతో రీకన్‌స్ట్రక్ట్ చేశారు. ప్రస్తుతం కెప్టెన్ మచ్చర్‌ను అబుదాబిలోని మిలిటరీ ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేసి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలైనప్పటికీ మచ్చర్ కోలుకుంటున్నారని, చికిత్సకు బాగా స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
గత వారం ప్రధాని నరేంద్ర మోదీ ఆయనతో వీడియో కాల్‌లో మాట్లాడి సాహసాన్ని ప్రశంసించారు. తాను నేలమీద పడిపోయి ఉన్నప్పటికీ ఇతరులను కాపాడుకోవాలనే పట్టుదలతోనే చివరి ప్రయత్నం చేసినట్లు కెప్టెన్ మచ్చర్ ప్రధానికి తెలిపారు. సమయస్ఫూర్తితో 170 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన ఆయన పోరాటంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్నది.
