రామచందర్ రావు.. మీకు నిజంగా చేతనైతే... కేంద్రం నుంచి రావాల్సిన అంశాలను సాధించండి: మంత్రి పొన్నం ప్రభాకర్

రామచందర్ రావు.. మీకు నిజంగా చేతనైతే... కేంద్రం నుంచి రావాల్సిన అంశాలను సాధించండి: మంత్రి పొన్నం ప్రభాకర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చేపట్టిన దీక్షపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ( ఆగస్టు 24 ) చిగురుమామిడి మండలం నవాబుపేటలో మీడియా సమావేశంలో మాడ్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు పొన్నం ప్రభాకర్. రామచందర్ రావు నిజంగా చేతనైతే.. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని అనుకుంటే ఢిల్లీకి వెళ్లి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అంశాలను సాధించాలని అన్నారు.

రామచందర్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియామకం పొందినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్ర బిజెపి పార్టీ అంతర్గత విభేదాల్లో తన ప్రాబల్యం చూపెట్టుకొనడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తిట్టడం ద్వారా తను ఒక నాయకుడిగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు పొన్నం.

ఫీజు రియంబర్స్మెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ పాత బకాయిలను విడుతల వారీగా పేమెంట్ చేస్తూనే, ఈ విద్యా సంవత్సరం నుండి ఫీజు రియంబర్స్మెంట్ అడ్వాన్స్డ్ గా పేమెంట్ చేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమల్లో లేదని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కు కేంద్రం నుండి ఏం సహకారం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు పొన్నం. 

గతంలో బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఉంటే వారితో కుమ్మక్కైన పార్టీగా ఎందుకు మీరు స్పందించలేదో జవాబు చెప్పాలని అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో పిల్లల విద్య కొరకు ఉన్నత ఆలోచనలతో అన్ని స్థాయిల్లో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని... సంక్షేమ హాస్టల్స్ కు గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తున్నామని, కిట్ ద్వారా నాణ్యమైన వస్తువులను సమకూరుస్తున్నామని, డైట్ చార్జీలు పెంచామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.

భవిష్యత్తులో ఫీజ్ రియంబర్స్మెంట్ కు సంబంధించి అడ్వాన్స్ పేమెంట్ తీసుకొచ్చి బ్యాంకుల్లో ముందే డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మీకేమైనా చాతనైతే మొసలి కన్నీరు కార్చడం ఆపి.. రాజకీయ ఉనికి కోసం నిరాహార దీక్ష చేయడం మానుకొని కేంద్ర ప్రభుత్వంపై భక్తులు తీసుకువచ్చి మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చేలా అక్కడి వారికి జ్ఞానోదయం కలిగించే ప్రయత్నం చేయాలని అన్నారు