సెప్టెంబర్ 1 నుంచి కొత్త ఎయిర్‌పోర్ట్ రూల్స్: ఇకపై బోర్డింగ్ పాస్‌లపై స్టాంప్ ఉండదు!

సెప్టెంబర్ 1 నుంచి కొత్త ఎయిర్‌పోర్ట్ రూల్స్: ఇకపై బోర్డింగ్ పాస్‌లపై స్టాంప్ ఉండదు!

ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక గొప్ప ఊరట లభించింది. విదేశాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద బోర్డింగ్ పాస్‌లపై ఇకపై స్టాంప్ వేసే విధానానికి తెరపడనుంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు వెల్లడైంది. విమానాశ్రయాల్లో ప్రయాణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత విధానం ప్రకారం విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ సమయంలో తమ బోర్డింగ్ పాస్‌ను కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆ డాక్యుమెంట్‌పై స్టాంప్ వేస్తారు. అయితే ఈ భౌతిక ప్రక్రియ వల్ల కౌంటర్ల వద్ద రద్దీ పెరగడంతో పాటు కొన్నిసార్లు స్టాంపులు సరిగ్గా పడక, చదవడానికి ఇబ్బందికరంగా మారేది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకే అధికారులు ఈ మార్పుకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ దీపక్ యాదవ్ అంతర్గత సమాచారం ప్రకారం.. ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి కూడా ఈ కొత్త విధానంపై స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాక అంతర్జాతీయ ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో డిజిటల్ రూపంలోనే ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాస్‌లను చూపించి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ప్రింటెడ్ హార్డ్ కాపీతో వెళ్లాలనిపిస్తే వారు పేపర్ కాపీని కూడా ఉపయోగించవచ్చు. డిజిటల్ అయినా, ప్రింటెడ్ అయినా సరే.. ఇకపై ఏ బోర్డింగ్ పాస్‌పై కూడా ఇమ్మిగ్రేషన్ స్టాంప్ వేయడం జరగదు.

ఈ మార్పుతో కౌంటర్ల వద్ద జరిగే అనవసరమైన ఆలస్యం పూర్తిగా తొలగిపోనుంది. భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరికి ఈ విధానం వల్ల ఎయిర్‌పోర్ట్ అనుభవం మరింత సులభతరంగా మారుతుంది. ప్రయాణికులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది కూడా ఈ మార్పుపై ప్రయాణికులకు తగిన అవగాహన కల్పిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి అమలయ్యే ఈ ఈజీ ఇమ్మిగ్రేషన్ విధానంపై ప్రయాణికుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది.