డబ్బు చేతికి వచ్చినట్లే వచ్చి నీళ్లలా ఖర్చైపోతోందా? సంపాదన ఎక్కువే ఉన్నా సేవింగ్స్ మాత్రం జీరోనా? చివరకు ఏముందంటే ఏమీ లేదు అనే పరిస్థితిలో ఉన్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. సంపాదన ఎంతన్నది ముఖ్యం కాదు.. ఉన్నదాన్ని ఎలా కాపాడుకుంటున్నారనేదే అసలైన మ్యాటర్. డబ్బును ఎలా మేనేజ్ చేయాలో తెలియక సతమతమవుతున్న వారి కోసం 7 సూపర్ టిప్స్ ఉన్నాయి. వీటిని పాటిస్తే ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి మారిపోతుంది.
1. అత్యవసర నిధి:
రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఉద్యోగం పోయినా, అకస్మాత్తుగా ఆసుపత్రి ఖర్చులు వచ్చినా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాల్సిందే. మీ కనీస జీవన ఖర్చులకు సరిపడేలా 3 నుండి 6 నెలల డబ్బును ఎప్పుడూ సులభంగా డ్రా చేసుకునేలా పక్కన పెట్టుకోండి.
2. జీతం రాగానే ఆటోమేటిక్ సేవింగ్స్:
జీతం రాగానే ముందుగా ఖర్చులు పెట్టి మిగిలింది దాద్దాం అనుకుంటే పొరపాటే. జీతం పడగానే ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా కొంత మొత్తాన్ని నేరుగా సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్‌కు వెళ్లేలా సెట్ చేసుకోండి. దీనివల్ల అనవసర ఖర్చులకు చెక్ పెట్టవచ్చు.
3. ఖర్చుల ట్రాకింగ్:
మీ డబ్బు ఎటు పోతుందో మీకు తెలియడం లేదా? ఒక బడ్జెట్ యాప్ వాడి ప్రతి చిన్న ఖర్చును నోట్ చేసుకోండి. అనవసర సబ్‌స్క్రిప్షన్లు, తరచూ చేసే చిన్న చిన్న ఖర్చులే మీ పొదుపును ఎలా కరిగిస్తున్నాయో అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది.
4. క్రెడిట్ కార్డుల తెలివైన వాడకం:
క్రెడిట్ కార్డులు శత్రువులు కావు. వాటిని సరిగ్గా వాడితే మిత్రులే. కార్డ్ ఉందిగా అని శక్తికి మించి ఖర్చు పెట్టకండి. గడువు తేదీలోపు పూర్తి బిల్లును చెల్లించడం అలవాటు చేసుకోండి. ఇది మీ క్రెడిట్ హిస్టరీని కాపాడటమే కాకుండా.. భారీ వడ్డీల బారి నుంచి రక్షిస్తుంది.
5. తొందరగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి:
పెట్టుబడులను ఎంత త్వరగా ప్రారంభిస్తే.. కాంపౌండింగ్ శక్తి వల్ల మీ డబ్బు అంత వేగంగా పెరుగుతుంది. లాంగ్ టర్మ్ గోల్స్ కోసం లో-కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ మంచి ఆప్షన్. అయితే మీ రిస్క్ టాలరెన్స్ బట్టి సరైన దాన్ని ఎంచుకోవటం బెటర్.
6. మీపై మీరు పెట్టుబడి పెట్టండి:
కేవలం డబ్బు దాచడమే కాదు.. మీ నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా సంపాదనను కూడా పెంచుకోవచ్చు. కొత్త సర్టిఫికేషన్లు, ప్రత్యేక స్కిల్ ట్రైనింగ్స్ మీకు మెరుగైన ఉద్యోగ అవకాశాలను తెచ్చిపెడతాయి. ఇది మీ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది.
7. జీతం గురించి మాట్లాడే ధైర్యం:
మీ భవిష్యత్ బోనస్‌లు, రిటైర్మెంట్ ఫండ్స్ అన్నీ మీ ప్రస్తుత జీతం మీదే ఆధారపడి ఉంటాయి. మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో పరిశోధించి.. మీ టాలెంట్ కి తగిన జీతం కోసం ఇంటర్వ్యూలలో కాన్ఫిడెంట్‌గా చర్చించండి. ఇది ప్రతినెల మంచి ఆదాయాన్ని అందించటమే కాక భవిష్యత్తులో గ్రోత్ కి కూడా ఉపయోగపడుతుంది.
