రూ. 13వేల కోట్ల డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న వీరేందర్ బసోయాను దుబాయ్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అతడి కొడుకు రిషబ్ బసోయకు జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు, లుకౌట్ నోటీసు రద్దు చేయాలని కోర్టు ఆదేశించడంతో అతడు యూకే నుంచి ఇండియాకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో త్వరలోనే అతడిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఉపశమనం కేవలం అతను భారతదేశానికి ప్రయాణించడానికి వీలు కల్పించేందుకేనని, అతనిపై కొనసాగుతున్న దర్యాప్తు, చట్టపరమైన చర్యలపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని కోర్టు స్పష్టం చేసింది. దుబాయ్ నుంచి వీరేందర్ బసోయాను బహిష్కరించిన కొన్ని వారాల తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ కేసులో సహ నిందితుడైన అతని కుమారుడు రిషబ్ బసోయా ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. అతను భారతదేశానికి తిరిగి వచ్చి విచారణలో చేరడానికి తన సుముఖతను వ్యక్తం చేశాడు.
రిషబ్ బసోయా భారతదేశానికి ప్రయాణించి, ప్రవేశించడానికి అవసరమైన మేరకు మాత్రమే అతనిపై జారీ చేసిన ఆర్‌సిఎన్ మరియు ఎల్‌ఓసిలను నిలిపివేయాలని ఆగస్టు 19న ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు.
డ్రగ్స్ కేసు విచారణపై ఈ ఉత్త్తర్వులు ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేసింది కోర్టు. అతను భారతదేశానికి వచ్చిన తర్వాత, చట్ట ప్రకారం అతడిని ప్రశ్నించడానికి, అరెస్టు చేయడానికి దర్యాప్తు సంస్థకు స్వేచ్ఛ ఉంటుందని పేర్కొంది.
