వికసిత్ భారత్ స్ఫూర్తితో తెలంగాణ రైజింగ్ 2047' లక్ష్యంతో ముందుకు వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం కావాలనే అడ్డుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి, డిసెంబర్‌లో నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించడానికి తాను తలపెట్టిన అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతోనే రద్దు చేసిందని ఆయన ఆరోపించారు.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కెనడా, అమెరికా పర్యటనలకు అనుమతినిచ్చిన కేంద్రం... తెలంగాణ ముఖ్యమంత్రి రైజింగ్ తెలంగాణ కోసం వెళ్తామంటే అనుమతులు తిరస్కరించడం ఫెడరల్ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని మండిపడ్డారు రేవంత్ . సీఎం పర్యటనను అడ్డుకోవడం కేవలం వ్యక్తిగత అడ్డగింత కాదని, అది నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అన్నారు.
విద్య, క్రీడలు తదితర రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు, ప్రఖ్యాత యూనివర్సిటీలను రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని నిబంధనల ప్రకారమే యూఎస్ టూర్‌కు దరఖాస్తు చేశామని స్పష్టం చేశారు. వివరాలు ఇవ్వలేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమన్నారు.
తెలంగాణకు పెట్టుబడులు వస్తే గుజరాత్‌కు రావేమోనన్న సంకుచిత భావజాలంతోనే ప్రధాని మోడీ, గుజరాత్ నాయకత్వం ఈ కుట్రకు తెరలేపాయని ఆరోపించారు. కేంద్రం వ్యవహరించిన తీరును పార్లమెంట్‌లో (లోక్‌సభ, రాజ్యసభ) తీవ్రంగా నిలదీస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన తెలంగాణ బీజేపీ ఎంపీలు... గుజరాత్‌కు మద్దతు ఇస్తూ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
