రాష్ట్రంలోకి విదేశీ బీర్లు, లగ్జరీ లిక్కర్.. 18 కొత్త సంస్థల నుంచి 121 లిక్కర్ బ్రాండ్లు

రాష్ట్రంలోకి విదేశీ బీర్లు, లగ్జరీ లిక్కర్.. 18 కొత్త సంస్థల నుంచి 121 లిక్కర్ బ్రాండ్లు
  • అందుబాటులోకి రానున్న గ్లెన్‌‌‌‌ఫిడిక్, ది మెకాలన్ లాంటి గ్లోబల్ మద్యం
  • సప్లయర్స్ నుంచి దరఖాస్తులకు పిలుపు
  • ట్రేడ్‌‌‌‌మార్క్ వివాదాలు రాకుండా కసరత్తు
  •  అభ్యంతరాలుంటే తెలియజేయాలని సెప్టెంబర్ 1 వరకు టీజీబీసీఎల్ గడువు
  •  వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో కొత్త మద్యం బ్రాండ్ల జాబితా
  • హైదరాబాద్, వెలుగు:

తెలంగాణలో మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు అంతర్జాతీయ, దేశీయ ప్రీమియం బ్రాండ్లు క్యూ కడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత గ్లెన్‌‌‌‌ఫిడిక్, ది మెకాలన్ సింగిల్ మాల్ట్ విస్కీలు, లూయిస్ థర్టిన్ వంటి కాగ్నాక్ లు, సరికొత్త ఫ్లేవర్ల విదేశీ బీర్లు, వైన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా 18 ప్రముఖ మద్యం సరఫరా సంస్థలకు చెందిన 121 రకాల నూతన లిక్కర్ బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) రంగం సిద్ధం చేసింది.

సంస్థతో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ లేని నూతన సప్లయర్స్ నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు, ఈ బ్రాండ్ల నమోదు ప్రక్రియపై అధికారికంగా ప్రజాభిప్రాయాన్ని, అభ్యంతరాలను ఆహ్వానిస్తున్నారు. మద్యం సరఫరాలో పారదర్శకతను పెంచేందుకు ఈ మొత్తం బ్రాండ్ల వివరాలు, కంపెనీలు సమర్పించిన పత్రాలను కార్పొరేషన్ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అందుబాటులో ఉంచినట్లు టీజీబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సి.హరి కిరణ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

మార్కెట్‌‌‌‌లో ఇప్పటికే ఉన్న బ్రాండ్లకు తోడు వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి మద్యం ఉత్పత్తులను చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కసరత్తు సాగుతోంది. ఎలాంటి చట్టపరమైన చిక్కులు, ట్రేడ్‌‌‌‌మార్క్ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే ఈ పబ్లిక్ నోటీసును జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హత సాధించిన బ్రాండ్లను మాత్రమే దశలవారీగా డిపోలకు, తద్వారా వైన్ షాపులకు సరఫరా చేయనున్నారు.

మద్యం విక్రయాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో పాటు గ్లోబల్ బ్రాండ్లను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. బ్రాండ్లపై అభ్యంతరాలకు సంబంధించి ప్రకటన వెలువడిన 10 రోజుల్లో అంటే సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు నాంపల్లి అబ్కారీ భవన్‌‌‌‌లో అందిన వినతులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. గడువు ముగిశాక వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ సమగ్రంగా విశ్లేషించి తుది నిర్ణయం తీసుకోనుంది.

లగ్జరీ, అల్ట్రా లగ్జరీ విదేశీ బ్రాండ్ల జోరు..

నూతనంగా రానున్న జాబితాలో లగ్జరీ, అల్ట్రా లగ్జరీ విభాగాలకు చెందిన ఫారిన్ లిక్కర్ బ్రాండ్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. విలియం గ్రాంట్ అండ్ సన్స్ ఇండియా సంస్థకు చెందిన గ్లెన్‌‌‌‌ఫిడ్డిచ్ 12, 15, 18, 21, 23, 26, 30 ఇయర్స్ సింగిల్ మాల్ట్ విస్కీలు, మంకీ షోల్డర్, హెండ్రిక్స్ జిన్ లాంటి ప్రీమియం బ్రాండ్లు అనుమతుల కోసం పోటీ పడుతున్నాయి.

హైదరాబాద్‌‌‌‌కు చెందిన ఎఫ్ఎల్ బేవరేజెస్ ద్వారా ది మెకల్లన్ హైలాండ్ సింగిల్ మాల్ట్ శ్రేణి, ది ఫేమస్ గ్రౌస్ విస్కీలతో పాటు బోటెసిని, చాటూ లే గ్రాండ్, ఆఫ్రికన్ ఫెదర్స్ బ్రాండ్ల ప్రఖ్యాత విదేశీ వైన్లు జాబితాలో చేరాయి. తాడేపల్లికి చెందిన గాయు లిక్కర్స్ సంస్థ ద్వారా లూయిస్ థర్టిన్ గ్రాండే షాంపైన్ కాగ్నాక్, రెమి మార్టిన్, బ్రూచ్‌‌‌‌లాడిచ్ విస్కీ, హార్డీస్ వైన్ బ్రాండ్లు మార్కెట్‌‌‌‌లోకి అడుగుపెట్టనున్నాయి.

డూబిజ్ సంస్థ తరఫున టైగర్ లాగర్, శాన్ మిగ్యుల్, రెడ్ హార్స్ వంటి అంతర్జాతీయ బీర్లు, కురజైన్ బేవరేజెస్ నుంచి జర్మనీకి చెందిన ఫ్లెన్స్‌‌‌‌బర్గర్ బీర్లు రిజిస్ట్రేషన్ రేసులో ఉన్నాయి. ఎడిసన్ రిటైల్ నుంచి గ్లెన్ ఫ్లాగ్లర్, ఎక్స్‌‌‌‌టిల్ ఆర్గానిక్ వోడ్కా, లోకా స్పిరిట్స్ నుంచి లోకా లోకా టెకిలా బ్రాండ్లు కూడా తుది ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. కొరియన్ రకాలైన సియోక్‌‌‌‌బింగో లాగర్, డాంగ్‌‌‌‌గుంగ్ బీర్లతో పాటు ఫైలీ బే విస్కీని నమోదు చేయాలని వింటర్‌‌‌‌ఫెల్ ఇంపెక్స్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఈ ఉత్పత్తులన్నీ తెలంగాణలోని ఉన్నత శ్రేణి మద్యం ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటాయని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. 

దేశీయ బ్రాండ్ల కూడా మన మార్కెట్‌‌‌‌లోకి.. 

విదేశీ బ్రాండ్లతో పాటే దేశీయంగా తయారయ్యే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌‌‌‌ఎల్), ప్రముఖ క్రాఫ్ట్ వైన్లు, వోడ్కా బ్రాండ్లు కూడా పెద్ద సంఖ్యలో మార్కెట్‌‌‌‌లోకి వచ్చేందుకు సన్నద్ధమయ్యాయి. అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్ సంస్థ ఆర్థౌస్ కలెక్టివ్ ఎలైట్ బ్లెండెడ్ మాల్ట్ విస్కీ, జోయా లగ్జరీ జిన్ బ్రాండ్ల నమోదుకు దరఖాస్తు సమర్పించింది.

ఎన్‌‌‌‌వీ డిస్టిలరీస్ నుంచి స్మోక్ ల్యాబ్ క్లాసిక్, సాఫ్రాన్, యానీసీడ్ వోడ్కాలతో పాటు రాయల్ ఎన్వీ ప్రీమియం విస్కీ అనుమతుల కోసం పరిశీలనలో ఉన్నాయి. కర్నాటకకు చెందిన రీకో వైనరీ ప్రైవేట్ లిమిటెడ్ ఇర్యా బ్రాండ్ పేరుతో రెడ్, వైట్, స్పార్క్లింగ్, హనీ వైన్లను తెలంగాణ విపణిలోకి తెచ్చేందుకు సిద్ధమైంది. బిడాడి వ్యాలీ బేవరేజెస్ నుంచి బాడ్ యాపిల్స్ చిల్లర్స్, చాచీ రెడ్ వైన్, శంకర్ డిస్టిలర్స్ నుంచి వర్చాస్ అమెరికన్ బ్లెండెడ్ విస్కీ బ్రాండ్లు ప్రతిపాదనల జాబితాలో నిలిచాయి.

మహారాష్ట్రకు చెందిన వల్లోన్ వైన్‌‌‌‌యార్డ్స్ సంస్థ స్వెవెన్, ఒర్యా పేర్లతో సరికొత్త శ్రేణి వైన్లను నమోదు చేయాలని కోరింది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (హెర్మెస్ డిస్టిలరీ) తమ మెక్‌‌‌‌డోవెల్స్ నంబర్ 1 క్లాసిక్ బ్లెండ్ విస్కీని ఈ నూతన జాబితాలో పొందుపరిచింది. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన ఆర్ఆర్ ఎంటర్‌‌‌‌ప్రైజెస్, ఏపీ రాయదుర్గం ఐథిరియం ఎగ్జిమ్ సంస్థలు ప్రీమియం బీర్లు, విదేశీ వైన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ మొత్తం 18 సరఫరాదారుల సాంకేతిక వివరాలు, కంపెనీ ఆధారాలను అధికారిక పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేశారు.