మేమూ ఇథనాల్ తయారు చేస్కుంటాం పర్మిషన్ ఇవ్వండి.. చెరుకు రైతుల డిమాండ్

మేమూ ఇథనాల్ తయారు చేస్కుంటాం పర్మిషన్ ఇవ్వండి.. చెరుకు రైతుల డిమాండ్

దేశంలో ఇథనాల్ వ్యాపారం లాభసాటిగా మారుతున్న తరుణంలో.. ఆ లాభాల ఫలాలు కేవలం పెద్ద పెద్ద చక్కెర కర్మాగారాలకే పరిమితం కాకుండా సామాన్య చెరుకు రైతులకు కూడా దక్కాలని రాష్ట్ర చెరుకు రైతుల సంఘం కోరుతోంది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ప్రభుత్వానికి ఒక కీలక విజ్ఞప్తి చేశారు. బ్రెజిల్ వంటి దేశాల తరహాలో మన దేశంలోనూ వికేంద్రీకృత విధానాన్ని తీసుకువస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం దేశంలోని పెద్ద చక్కెర మిల్లులు ఇథనాల్ ఉత్పత్తి ద్వారా అపారమైన లాభాలను ఆర్జిస్తున్నాయి. కానీ చెరుకు పండించే అన్నదాతలు మాత్రం గిట్టుబాటు ధర రాక నిత్యం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ అసమానతను తొలగించడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని రైతులు కోరుతున్నారు.

బెల్లం యూనిట్లలోనే ఇథనాల్ తయారీ..
రైతులు తమ గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక బెల్లం తయారీ యూనిట్లలోనే సొంతంగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేసుకునేలా ప్రభుత్వం సరళమైన నిబంధనలతో కూడిన ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని శాంతకుమార్ డిమాండ్ చేశారు. దీనివల్ల పెద్ద మిల్లులపైనే పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం రైతులకు ఉండదని రైతులు చెరకు సాగు నుంచి మంచి ఆదాయం పొందుతారని చెప్పారు.

రైతులకే ప్రత్యక్ష ప్రయోజనాలు..
ఈ స్థానిక యూనిట్లలో ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌ను రైతులు తమ స్వంత ట్రాక్టర్లకు, ఇతర వాహనాలకు ఇంధనంగా వాడుకోవడంతో పాటు ఇళ్లలో పర్యావరణ హితమైన వంట చెరుకుగా కూడా ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఇక మిగిలిన అదనపు ఇథనాల్‌ను ప్రభుత్వమే ఒక రేటు నిర్ణయించి కొనుగోలు చేసేలా విధానం రూపొందిస్తే రైతుల ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని.. వారి ఆదాయం కూడా బలపడుతుందని తెలిపారు.

కరువు ప్రాంతాల రైతులకు ప్రత్యేక అండ..
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైన కరువు కారణంగా చెరుకు దిగుబడి భారీగా పడిపోయింది. పెరిగిన పెట్టుబడి ఖర్చులు, పంట నష్టాల కారణంగా రైతులు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరువు ప్రాంతాల రైతులకు శాస్త్రీయ పద్ధతిలో ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ పెంచాలని, మిల్లుల బై-ప్రొడక్ట్స్ లాభాలలో రైతులకు కూడా వాటా దక్కేలా చూడాలని కోరారు.

బ్రెజిల్ మోడల్ అమలు చేయాలి..
బ్రెజిల్ దేశంలోని చెరుకు-ఇథనాల్ విధానాన్ని ఉదాహరణగా చూపుతూ.. చెరుకు దిగుబడి ఎక్కువగా ఉన్నప్పుడు చక్కెర ఉత్పత్తిని తగ్గించి, ఆ సర్ ప్లస్ చెరుకును ఇథనాల్ తయారీకి మళ్లించాలని రైతు సంఘం సూచించారు. దీనివల్ల మార్కెట్లో చక్కెర ధరలు పడిపోకుండా రైతులు నష్టపోకుండా కాపాడుకోవచ్చు. అదే సమయంలో కరువు కాలంలో ఇథనాల్ ఉత్పత్తిని నియంత్రించి దేశీయ అవసరాలకు చక్కెరను కేటాయించడం ద్వారా ధరల పెరుగుదలను నివారించవచ్చని తెలిపారు. రైతుల డిమాండ్ ఒక విధంగా ఉంటే ఇప్పటికే దేశ అవసరానికి మించి ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీలు పెట్టేసిన బడా కంపెనీలు ఇదెట్టా కుదురుతుంది అంటూ పెదవి విరుస్తున్నాయి.