హైదరాబాద్‌లోని సిటీ కాలేజీలో పెను ప్రమాదం తప్పింది. వందలాది మంది విద్యార్థులు చదువుకునే ఈ కాలేజీ భవనంలోని ఓ కారిడార్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పడంతో విద్యార్థులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ తరగతులు జరిగే సమయమై ఉంటే పరిస్థితి ఏంటని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలావస్థకు చేరిన భవనాన్ని పరిశీలించారు. భవిష్యత్తులో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా, సిటీ కాలేజీ మరమ్మత్తు పనులను వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన అధికారులను కోరారు.
ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ హయాంలో... 1915 నుంచి 1920 మధ్య కాలంలో ఈ ప్రభుత్వ నగర కళాశాల భవనాన్ని నిర్మించారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ అద్భుత కట్టడం, నేడు సరైన నిర్వహణ లేక శిథిలమైపోతోంది.
