చందమామ కథలు సినిమాలో బిచ్చగాడు పాత్ర ఇల్లు కొనడం కోసం డబ్బులు దాచుకొని ఆఖరికి తాను అనుకున్న ఇల్లు కొనే సమయానికి చనిపోతాడు కదా... ఈ సీన్ గుర్తుందా..? సరిగ్గా ఇలాంటి సీన్ కర్ణాటకలో జరిగింది. ఓ వృద్ధురాలు మసీదు ముందు బిక్షాటన చేస్తూ జీవనం సాగించేది. వయసు పైబడ్డ ఆ వృద్ధురాలు చనిపోయింది.. అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్లి చుసిన బంధువులు అవాక్కయ్యారు. ఇంట్లో ఎక్కడ చూసినా సంచుల్లో నోట్ల కట్టలు నాణేలు ఉన్నాయి. కర్ణాటకలోని మండ్య జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి....
మండ్య జిల్లాకు చెందిన 68 ఏళ్ళ హూర్ తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో ఉండేది.. ఆమె రెండేళ్ల క్రితం చనిపోయింది. వారిద్దరికీ పెళ్లి కాలేదు. ఇటీవల హూర్ కూడా ఇంట్లో శవమై కనిపించింది. స్థానికులు ఆమె ఇంటిని తనిఖీ చేయగా, 30కి పైగా సంచులలో రూ. పది, 20, 50 నోట్ల కట్టలు, వేల కొద్దీ నాణేలు బయటపడ్డాయి.ఆమె ఇంట్లో దొరికిన సంచుల్లో డబ్బులు, నాణేలు స్థానికులు లెక్కపెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హూర్ ఇంట్లో ఉన్న సంచులు లెక్కించగా... మొత్తం రూ. 8 లక్షల 40వేలుగా తేలింది. ఆ డబ్బును ఆమె సోదరులకు అందజేశారు. సోదరులలో ఒకరు రూ. 6 లక్షలు తీసుకోగా, మరొకరు రూ. 2,40,000 తీసుకుని, ఆ మొత్తాన్ని ఒక మసీదుకు విరాళంగా ఇచ్చారు. బతికినంత కాలం బిచ్చమెత్తుకొని కూడబెట్టిన డబ్బు అనుభవించకుండానే చనిపోయింది పాపం అంటూ... దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు స్థానికులు బంధువులు.
