బ్యాంకింగ్ రంగంలో మళ్లీ ఆందోళనలు మెుదలౌతున్నాయి. వారంలో 5 రోజుల వర్క్ కల్చర్ తమ హక్కని.. వివక్షతో కూడిన పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ విధానం నడవదు అంటూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్ ఉద్యోగులు బంద్ కి పిలుపునిచ్చారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన ఈ సమ్మె ప్రకటనతో రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సేవలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు తప్పవనే హెచ్చరికల మధ్య, బ్యాంక్ ఉద్యోగులు ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బ్యాంక్ ఉద్యోగులు ప్రధానంగా రెండు డిమాండ్లను తెరపైకి తెచ్చారు. మొదటిది వారానికి 5 రోజుల వర్కింగ్ అమలు. మార్చి 8, 2024 నాడు జరిగిన 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా.. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజువారీ పనివేళలను 40 నిమిషాలు పెంచి, శని, ఆదివారాలు సెలవులు ఇవ్వాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే 2 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేయడంపై యూనియన్లు మండిపడుతున్నాయి.
ఇక రెండోది అత్యంత వివాదాస్పదమైన పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్(PLI) విధానంలో వివక్ష. అసలు ఒప్పందం ప్రకారం పీఎల్‌ఐ అనేది బ్యాంకు మొత్తం పనితీరు ఆధారంగా.. స్కేల్-7 అధికారుల వరకు అందరికీ ఒకేలా ఉండాలి. కానీ ఆర్థిక శాఖ ఏకపక్షంగా వ్యవహరించి స్కేల్-4 అధికారులకు పైన ఉన్నవారికి వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఏకంగా 365 రోజుల బేసిక్ పే వరకు ఇన్సెంటివ్ ప్రకటించింది. అదే సమయంలో వర్క్‌మెన్ ఉద్యోగులు, స్కేల్-3 వరకు ఉన్న అధికారులకు మాత్రం కేవలం గరిష్టంగా 15 రోజుల బేసిక్ పే ప్లస్ డీఏ మాత్రమే ఇస్తామని చెప్పడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. కేవలం 5 శాతం మంది ఉన్న ఉన్నతాధికారులకు భారీ లబ్ది చేకూర్చి.. మిగతా 95 శాతం మంది సిబ్బందిని విస్మరించడం ఏంటని యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి.
ఈ డిమాండ్ల సాధన కోసం బ్యాంక్ యూనియన్ స్పష్టమైన సమ్మె షెడ్యూల్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 11, 2026 నాడు ఒక రోజు సమ్మె. ఆ తర్వాత సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మరో 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే.. అక్టోబర్ 26 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్లు హెచ్చరించాయి. మొత్తానికి పనిభారం తగ్గించి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కల్పించాలని కోరుతున్న ఉద్యోగులకు, ప్రభుత్వ తాజా విధానాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఈ సమ్మెలపై ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.
