ఇస్రో కీలక నిర్ణయం.. రాకెట్ల తయారీ ప్రైవేట్ రంగానికే...

ఇస్రో కీలక నిర్ణయం..  రాకెట్ల తయారీ ప్రైవేట్ రంగానికే...

న్యూఢిల్లీ: రాకెట్లు (లాంచ్ వెహికల్స్), సాధారణ ఉపగ్రహాల తయారీ బాధ్యతలను పూర్తిగా ప్రైవేట్ రంగానికి లేదా ప్రభుత్వ సంస్థలకు అప్పగించి, కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌మెంట్ (ఆర్‌‌‌‌‌‌‌‌ అండ్ డీ),  భారీ మిషన్లపైనే  ఇండియన్‌‌‌‌ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) దృష్టి పెడుతుందని  స్పేస్‌‌‌‌ రెగ్యులేటరీ ఇన్‌‌‌‌-–స్పేస్  చైర్మన్ పవన్ గోయెంకా వెల్లడించారు. వచ్చే ఏడాది మనుషులతో కూడిన అంతరిక్ష యాత్ర, 2035 నాటికి  స్పేస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడిని దించడం వంటి భారీ మిషన్లను  ఇస్రో  చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

450కి పైగా స్పేస్ స్టార్టప్‌‌‌‌లకు భారీ ఊతం
ప్రస్తుతం దేశంలో దాదాపు 450 స్పేస్ స్టార్టప్‌‌‌‌లు ఉండగా, తాజా నిర్ణయంతో అప్‌‌‌‌స్ట్రీమ్ (తయారీ, ప్రయోగాలు), డౌన్‌‌‌‌స్ట్రీమ్ (డేటా, అప్లికేషన్లు)  రంగాల్లోని కంపెనీలకు  భారీగా   అవకాశాలు లభించనున్నాయి.  రాకెట్ తయారీ, శాటిలైట్ అసెంబ్లింగ్ వంటి బాధ్యతలను అగ్నికుల్ కాస్మోస్, స్కైరూట్ వంటి స్టార్టప్‌‌‌‌లు, ఇతర ప్రైవేట్ సంస్థలు అందుకోనున్నాయి.   కక్ష్యలోకి చేరిన శాటిలైట్ల నుంచి వచ్చే ముడి డేటాను ఉపయోగించి వ్యవసాయం, వాతావరణం, విపత్తు నిర్వహణ, రక్షణ రంగాలకు అవసరమైన అనలిటిక్స్ సేవలను అందించడానికి  సుహోరా  వంటి కంపెనీలు ముందుకు రానున్నాయి.   కొత్త స్పేస్ పాలసీ 2023, ఎఫ్‌‌‌‌డీఐ పాలసీ 2024 వంటి సంస్కరణల మద్దతుతో ప్రస్తుతం 9 బిలియన్ డాలర్లు (రూ.86 వేల కోట్లు) గా ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2033 నాటికి 44 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.4.22 లక్షల కోట్లకు) చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.