రియాక్టర్ల పేలుళ్లతో.. ప్రాణాలకు ముప్పు.. ఫార్మా కంపెనీల్లో తనిఖీలు బంద్ చేసిన ఆఫీసర్లు

రియాక్టర్ల పేలుళ్లతో.. ప్రాణాలకు ముప్పు.. ఫార్మా కంపెనీల్లో తనిఖీలు బంద్ చేసిన ఆఫీసర్లు
  • రెండేళ్లలో 8 మంది మృతి, 35 మందికి పైగా గాయాలు
  • ఫార్మా కంపెనీల్లో తనిఖీలు బంద్ చేసిన ఆఫీసర్లు

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిశ్రమలు ప్రమాదాలకు కేరాఫ్  అడ్రస్‌‌గా మారుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట జరుగుతున్న పేలుళ్లతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ రియాక్టర్  పేలుతుందో? ఏ బాయిలర్  విస్ఫోటనం చెందుతుందో ? తెలియని పరిస్థితి నెలకొంది. ఇలా వేలాది మంది ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పని చేస్తున్నారు. రెండేళ్లలో రియాక్టర్ల పేలుళ్లతో 8 మంది చనిపోగా, 35 మందికి పైగా గాయపడ్డారు. ఇక కంపెనీల్లో ఆఫీసర్లు తనిఖీ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

3 వేలకు పైగా పరిశ్రమలు
హైదరాబాద్‌‌కు కూతవేటు దూరంలో ఉండడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేలాది పరిశ్రమలు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో 700 పైగా రైస్  మిల్లులు, సిమెంట్  కంపెనీలు ఉండగా, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, బీబీనగర్  ప్రాంతాల్లో ఫార్మా, బల్క్  డ్రగ్  యూనిట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 3 వేలకు పైగా ఉన్న ఈ పరిశ్రమల్లో మెజారిటీ రసాయన  పరిశ్రమలే. వీటిలో నిరంతరం మండే స్వభావం ఉన్న కెమికల్స్, భారీ ఒత్తిడితో పని చేసే బాయిలర్లు ఉండడంతో చిన్నపాటి అజాగ్రత్త కూడా పెను ప్రమాదానికి దారితీస్తోంది.

పేలిపోతున్న బాయిలర్లు, రియాక్టర్లు   
ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లను వినియోగిస్తుండగా, రైస్  మిల్లులు, సిమెంట్ ఫ్యాక్టరీల్లో బాయిలర్లను వాడుతుంటారు. ఈ పరిశ్రమల్లో అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి భద్రతా చర్యలు తీసుకుంటున్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలి. భద్రత, కాలుష్య నియంత్రణ, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన శాఖల అధికారులు పర్యవేక్షించాలి.

ఫ్యాక్టరీస్​ ఇన్​స్పెక్టర్, పరిశ్రమలు, అగ్నిమాపక, కార్మిక శాఖల అధికారులు తనిఖీల్లో లోపాలను గుర్తించి యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలి. కానీ, తనిఖీలు చేయకుండానే పరిశ్రమలకు సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఆఫీసర్లు, ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్నారనే విమర్శలున్నాయి. కెమికల్  ఫ్యాక్టరీలు కావడంతో విషవాయువులు కూడా ప్రమాదకరంగా మారి కార్మికులను బలిగొంటున్నాయి.

రెండేళ్లలో 8 మంది బలి, 35 మందికి పైగా గాయాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి, చిట్యాల పరిసర ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.  రెండేళ్లలోనే రియాక్టర్  పేలుళ్లు, విషవాయువుల లీకేజీలు, విస్ఫోటనాల కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన ఘటనతో కలిపి 35 మందికి పైగా కార్మికుల శరీరాలు కాలిపోయి నరకయాతన అనుభవిస్తున్నారు. ఎన్నో ఫ్యామిలీలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతుంటే, మరికొందరు శాశ్వత అంగవైకల్యంతో బతుకీడుస్తున్నారు.

వరుస ప్రమాదాలు జరుగుతున్నా..
భూదాన్  పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హజేలో లేబరేటరీస్ లో జరిగిన రియాక్టర్  పేలుడులో ఇద్దరు కార్మికులు చనిపోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పరిశ్రమలో నెలల వ్యవధిలోనే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కావడం స్థానికులను కలచి వేస్తోంది. చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని నోష్  ఫార్మా ల్యాబ్‌లో రియాక్టర్  పేలి కార్మికులు చనిపోయారు. ఈ పరిశ్రమలో ఏడాదిలోనే రెండు సార్లు రియాక్టర్  పేలి కార్మికులకు గాయాలయ్యాయి.

కనిపించని తనిఖీలు..
వాస్తవానికి ప్రతి మూడు నెలలకోసారి ఫ్యాక్టరీస్​ ఇన్‌‌స్పెక్టర్, కార్మిక, అగ్నిమాపక శాఖల అధికారులు కలిసి తనిఖీలు నిర్వహించాలి. అయితే తనిఖీలు చేయకుండానే ఫిట్‌‌నెస్  సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. సిబ్బంది కొరత సాకుతో తప్పించుకుంటున్నారు.

జిల్లాల విభజన జరిగినా పరిశ్రమల పర్యవేక్షణ కార్యాలయాలు మాత్రం పాత పద్దతిలోనే కొనసాగుతున్నాయి. వేలాది పరిశ్రమలను తనిఖీ చేయడానికి కనీసం 10 మంది సిబ్బంది కూడా లేరు. తనిఖీల గురించి అడిగితే అధికారులు సిబ్బంది కొరతను సాకుగా చూపుతున్నారు. దీనిని అలుసుగా తీసుకుంటున్న ఫ్యాక్టరీ ఓనర్లు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారు.