మట్టి వాసనలో మిగిలిన బాల్యం..
కొండ నీడలో పెరిగిన జ్ఞాపకాలు..
మాది భువనగిరి..
పుట్టింది భువనగిరి..
ఈ రెండు మాటల్లోనే
నా జీవితమంతా దాగి ఉంది.
ఇప్పుడున్న ఎన్నెన్నో పట్టణాలు
పుట్టకముందే,
తనదైన చరిత్రతో,
తనదైన దర్పంతో,
తనదైన సంస్కృతితో
పాలన సాగించిన గడ్డ
భువనగిరి.
అనేక చారిత్రాత్మక సందర్భాలకు
పురుడు పోసిన గడ్డ..
ఎన్నో తరాల జ్ఞాపకాలను
తన ఒడిలో దాచుకున్న గడ్డ..
భువనగిరి అంటే
ఒక ఊరి పేరు మాత్రమే కాదు.
అది నా బాల్యం..
అది నా యవ్వనం..
అది నా స్నేహం..
అది నా తొలి కల..
అది నా తొలి ఓటమి..
అది నా తొలి గెలుపు..
అన్నిటికంటే మించి..
అది నా మట్టివాసన
అది నా జిందగీ.
మా ఊరంటే
తమలపాకుల పరిమళం..
అరటిపండ్ల తీపి..
చలివేంద్రంలో దాహార్తి తీర్చే కూజా నీళ్ల చల్లదనం..
వీధుల్లో సందడి..
పండుగల్లో హంగామా..
ఎదురైన ప్రతివాడి ఆత్మీయ పలకరింపు..
వీధివీధినా మనుషుల మమకారం..
మా భువనగిరిలో
దోస్త్‌ల ఇంట్లో ఎవరి కార్యం జరిగినా
అది ఒక్కరి ఇంటి పండుగ కాదు..
అందరి ఇంటి పండుగ.
ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా
అది ఒక్కరి ఇంటి కష్టం కాదు..
అందరి కష్టం.
ఒకరి సంతోషం
అందరి సంతోషం..
ఒకరి బాధ
అందరి బాధ..
అందుకే
భువనగిరి ఒక ఊరు మాత్రమే కాదు..
ఒక్క కుటుంబం.
కాలం మారినా..
మనుషులు మారినా..
ఊర్లు పట్టణాలైనా..
ఆ మట్టి వాసన మారదు.
ఆ జ్ఞాపకాలు చెరిగిపోవు.
ఆ స్నేహాలు దూరం కావు.
ఎందుకంటే,
మనిషి ఎక్కడికి వెళ్లినా
తన ఊరిని తనలోనే మోస్తాడు
అందుకే మా బోనగిరి చెప్తుంది
“దోస్త్‌లను మరవకు..
దోస్తానీని విడవకు..
మట్టి తల్లిని విడిచిపోకు..
మన భువనగిరిని మరువకు..”
మాది భువనగిరి..
పుట్టింది భువనగిరి..
పైదాయిషీ భువనగిరి..
ప్రాణం ఉన్నంతవరకు
మనసులో నిలిచే నా భువనగిరి!
- సురేష్ కాలేరు-
లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ featureseditor@v6velugu.com
