భారతీయ రోడ్లపై ప్రయాణాలను మరింత సురక్షితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. రాత్రి వేళల్లో, ప్రతికూల వాతావరణంలో ఎదురుగా వచ్చే వాహనాల హెడ్‌లైట్ల తీవ్రమైన కాంతి కారణంగా డ్రైవర్లు ఇబ్బంది పడుతున్న ఉదంతాలను దృష్టిలో ఉంచుకుని, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్‌లో కొన్ని కీలక సవరణలను ప్రతిపాదించింది. ఈ కొత్త భద్రతా నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి.
టూ-వీలర్లు, కార్లపై హెడ్‌లైట్ ఆంక్షలు..
ప్రస్తుతం ద్విచక్ర వాహనాల్లో ఉన్న ఆటోమేటిక్ హెడ్‌లైట్ ఆన్ సిస్టమ్ హై లేదా లో బీమ్‌లలో ఏది కావాలంటే దానిని అందిస్తోంది. అయితే ఇకపై కొత్తగా వచ్చే టూ-వీలర్లలో ఆటోమేటిక్ హెడ్‌లైట్లు కేవలం 'లో-బీమ్' మోడ్‌లో మాత్రమే పనిచేసేలా రూల్స్ తెస్తున్నారు. దీనివల్ల ఎదురువచ్చే వారికి ఇబ్బందికరమైన కాంతి పడదన్నమాట.
అలాగే హెడ్‌లైట్ల గరిష్ట ప్రకాశాన్ని (ల్యూమినస్ ఇంటెన్సిటీ) కూడా తగ్గిస్తున్నారు. ముందుగా టూవీలర్లకు1.5 లక్షల క్యాండెలా (cd) నుండి 1 లక్ష cd కి తగ్గింపు. అలాగే నాలుగు చక్రాల వాహనాలకు 2.25 లక్షల cd నుండి 1.5 లక్షల cd కి తగ్గింపు. అంతేకాకుండా హెడ్‌లైట్ల రంగు ఉష్ణోగ్రతను గరిష్టంగా 6,500 కెల్విన్ (K) కు పరిమితం చేయనున్నారు. దీనివల్ల తెల్లటి కాంతి సృష్టించే తీవ్రమైన గ్లేర్ సమస్య తగ్గుతుంది.
అర్బన్ ఏరియాల్లో హై-బీమ్ వార్నింగ్..
నగరాల్లో చాలా మంది అవసరం లేకపోయినా హై-బీమ్ లైట్లను వాడుతుంటారు. దీనికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఒక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొస్తోంది. సిటీ రోడ్లలో డ్రైవర్లు మ్యాన్యువల్‌గా హై-బీమ్‌కి చేంజ్ చేస్తే.. వారిని అప్రమత్తం చేసేలా ఒక ఆడియో అలర్ట్ సిస్టమ్ రానుంది. అయితే ఇది స్పీడ్-సెన్సిటివ్‌గా ఉంటుంది. హైవేలపై గంటకు 60 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు ఈ అలర్ట్ మోగదు. ఎందుకంటే చీకటిగా ఉండే హైవేలపై హై-బీమ్ అవసరం కాబట్టి డ్రైవర్లకు మినహాయింపు ఉంటుందట.
భారీ వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్స్ తప్పనిసరి..
రాత్రి సమయాల్లో, పొగమంచు.. వర్షాకాలంలో బస్సులు ఇతర భారీ వాహనాలు సరిగ్గా కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని నివారించడానికి హెవీ వెహికల్స్‌కు నాణ్యమైన జెన్యూన్ రిఫ్లెక్టివ్ టేప్స్ వాడటాన్ని తప్పనిసరి చేయనున్నారు. ఇది దూరంగా ఉన్న ఇతర వాహనదారులకు భారీ వాహనాలు ఉన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ కొత్త రూల్స్ ద్వారా రోడ్లపై ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, ప్రమాదాలను తగ్గించే విధంగా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం.
