287 బడుల్లో కొత్త సైన్స్ ల్యాబ్లు.. లిస్టులో 91 కేజీబీవీలు, 180 జడ్పీ హైస్కూళ్లు.. ఒక్కో స్కూల్కు రూ.26 లక్షల కేటాయింపు

287 బడుల్లో కొత్త సైన్స్ ల్యాబ్లు.. లిస్టులో 91 కేజీబీవీలు, 180 జడ్పీ హైస్కూళ్లు.. ఒక్కో స్కూల్కు రూ.26 లక్షల కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లను సైన్స్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా మార్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోగాల ద్వారా పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేయించేందుకు 287 బడుల్లో కొత్తగా అత్యాధునిక సైన్స్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం రూ.74.62 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 287 బడుల్లో అత్యధికంగా కేజీబీవీలు, జిల్లా పరిషత్ హైస్కూళ్లకే ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది.

ఇందులో 180 జడ్పీహెచ్ఎస్, గవర్నమెంట్ హైస్కూళ్లు ఉండగా.. 91 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీ) , మరో 16 మోడల్ స్కూళ్లలో ఈ అత్యాధునిక ల్యాబ్ గదులను నిర్మించనున్నారు. ప్రతి స్కూల్​లో సైన్స్ ల్యాబ్ నిర్మాణం, పరికరాల కోసం మొత్తం రూ. 26 లక్షలు ఖర్చు చేయనున్నారు. దీనిలో ల్యాబ్ గది నిర్మాణం, వర్క్ స్టేషన్స్, ఫర్నిచర్ కోసం రూ. 25 లక్షలు కాగా, సైన్స్ ల్యాబ్ ఎక్విప్​మెంట్ కొనుగోలుకు మరో రూ. లక్ష చొప్పున కేటాయించారు. 

ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికం

ఆదిలాబాద్ జిల్లాకు అత్యధికంగా 17 ల్యాబ్​లు మంజూరయ్యాయి. ఆ తర్వాత సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో తలా 14 స్కూళ్లు ఎంపికయ్యాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 13, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కో చోట 11 స్కూళ్లలో ల్యాబ్​లు నిర్మిస్తున్నారు. ఈ ల్యాబ్​ల నిర్మాణ బాధ్యతను తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూఐడీసీ)కు అప్పగించారు.

టర్న్ కీ పద్ధతిలో గదుల నిర్మాణం నుంచి ఎలక్ట్రిఫికేషన్, పరికరాల ఏర్పాటు వరకు అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. పనుల నాణ్యతను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయాలని.. అంతా సక్రమంగా ఉంటేనే హెడ్ మాస్టర్లకు ల్యాబ్​లను అప్పగించాలని స్పష్టం చేశారు. ఈ మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. త్వరలోనే ఈ ల్యాబ్లు అందుబాటులోకి వస్తే గ్రామీణ విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు చేసే వెసులుబాటు కలుగనుంది.