- ప్రాంక్ మెసేజ్ ఎంత పన్జేసింది ? కిడ్నాప్ అయ్యానంటూ ప్రియురాలికి మెసేజ్
- భయపడి 112కు ఫోన్ చేసిన యువతి.. యువకుడి ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులు
- తనిఖీల్లో రూ.30 లక్షల నగదు గుర్తింపు..బయటపడిన క్రికెట్ బెట్టింగ్
- ముగ్గురు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
కూకట్పల్లి, వెలుగు: ప్రియురాలిని ఆట పట్టించేందుకు ఓ యువకుడు చేసిన ప్రాంక్ మెసేజ్ అతడి బెట్టింగ్ బండారాన్ని బయటపెట్టింది. సరదాగా చేసిన మెసేజ్‌తో పోలీసులు అతడు ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లగా.. అక్కడ రూ.30 లక్షల నగదు దొరికింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన కేపీహెచ్‌బీ కాలనీలో జరిగింది. దేశినేని సుమంత్ (25), మాకటి మనోజ్ (29), కానుమూరి గౌతమ్ చౌదరి (29) కేపీహెచ్‌బీ కాలనీలోని ఇండిస్ వన్ సిటీ అపార్ట్‌మెంట్స్‌లో ఓ ఫ్లాట్‌లో ఉంటున్నారు.
వీరు కొంతకాలంగా ఎవరికీ అనుమానం రాకుండా రహస్యంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం సుమంత్ తన ప్రియురాలికి సరదాగా మెసేజ్ చేశాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని అందులో పేర్కొన్నాడు. అయితే ఆ మెసేజ్‌ను నిజమేనని నమ్మిన యువతి భయపడింది. వెంటనే 112కు ఫోన్ చేసి తన ప్రియుడిని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు సమాచారం ఇచ్చింది. యువతి ఫిర్యాదుతో కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
కిడ్నాప్ ఘటనగా భావించి ఇండిస్ వన్ సిటీ అపార్ట్‌మెంట్స్‌లోని సుమంత్ ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లారు. అక్కడ సుమంత్‌తో పాటు మరో ఇద్దరు ఉండటాన్ని గుర్తించారు. విచారించగా ఎలాంటి కిడ్నాప్ జరగలేదని తేలింది. అనుమానం రావడంతో పోలీసులు ఫ్లాట్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.30 లక్షల నగదు బయటపడింది. దీంతో పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో ఆ రూ.30 లక్షలు క్రికెట్ బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బుగా నిందితులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా ఫ్లాట్ కేంద్రంగా బెట్టింగ్ దందా సాగిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో కిడ్నాప్ అంటూ చేసిన ఒక్క ప్రాంక్ మెసేజ్‌తో అసలు బెట్టింగ్ వ్యవహారం బయటపడింది. నిందితుల నుంచి రూ.30 లక్షల నగదుతో పాటు ఒక ట్యాబ్, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
