అమెరికా ట్రెజరీ బాండ్ మార్కెట్ పరిణామాలు, రికార్డు స్థాయికి చేరిన యూఎస్ ప్రభుత్వ రుణాలు, బలహీనపడుతున్న డాలర్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. వాషింగ్టన్ జాతీయ రుణం భారీ స్థాయికి చేరిన వేళ.. దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడానికి అమెరికా ట్రెజరీ తీసుకున్న నిర్ణయాలు బాండ్ ఈల్డ్స్‌ను, డాలర్ విలువను పడగొట్టాయి. ఈ పరిణామాల వల్ల గ్రీన్‌బ్యాక్ అదేనండి అమెరికా డాలర్ కరెన్సీ బలహీనపడటంతో ద్రవ్య లోటు భయాల నుంచి గట్టెక్కడానికి చేసే ప్రయత్నాలు ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించాయి. దీనివల్ల కాగితపు కరెన్సీలపై నమ్మకం సడలి, ఇన్వెస్టర్లు మళ్లీ సురక్షిత ప్రత్యామ్నాయంగా భావించే పసిడి వైపు మొగ్గుచూపుతున్నారని తేలింది. అందుకే బులియన్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్నాయి.
ప్రస్తుతం 24-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.లక్షా 64వేల మార్కును తాకడంతో.. గోల్డ్ ద్రవ్యోల్బణాన్ని నిజంగానే దీర్ఘకాలంలో ఎదుర్కొంటుందా అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఫండ్స్ ఇండియా ఆగస్టు 2026 రిపోర్ట్ ప్రకారం.. బంగారం స్వల్పకాలంలో హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మాత్రం ద్రవ్యోల్బణాన్ని నిలకడగా అధిగమిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 1995 నుంచి 2025 మధ్య డేటాను పరిశీలిస్తే.. కేవలం ఒక ఏడాది కాలపరిమితిలో బంగారం రాబడులు అత్యంత అస్థిరంగా ఉన్నాయి. కొన్ని సమయాల్లో ద్రవ్యోల్బణం కంటే 24 శాతం అధిక లాభాలను ఇస్తే.. మరికొన్ని సందర్భాల్లో 28 శాతం తక్కువ లాభాలను ఇచ్చి నిరాశపరిచాయి. ఈ స్వల్పకాలిక వ్యత్యాసాల కారణంగా బంగారం ధరలు ప్రతిసారీ ద్రవ్యోల్బణాన్ని పెంచుతూపోతాయని కచ్చితంగా చెప్పలేం.
అయితే పెట్టుబడి కాలాన్ని పెంచుకుంటూ పోతే ఈ చిత్రంలో స్పష్టత వస్తుంది. 5, 10, 15, 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితిని పరిశీలిస్తే.. బంగారం సగటున ద్రవ్యోల్బణం కంటే దాదాపు 5 శాతం అదనపు వార్షిక రాబడిని అందించినట్లు నివేదిక తేల్చింది. అంటే షార్ట్ టర్మ్‌లో బంగారం ధరలు ప్రతిరోజూ పెరగకపోయినా, లాంగ్ టర్మ్‌లో మాత్రం ద్రవ్యోల్బణ దెబ్బ నుంచి మన కొనుగోలు శక్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మొత్తంగా చూస్తే.. చరిత్ర ప్రకారం బంగారం ఎప్పుడూ ఒకే రేఖలో స్థిరమైన లాభాలను ఇవ్వలేదు. వివిధ కాలాల్లో దీని సగటు వార్షిక రాబడి సుమారు 10 శాతంగా ఉంది. కాబట్టి కేవలం రెండు మూడు రోజుల్లో వచ్చే ధరల పెరుగుదలను బట్టి కాకుండా.. లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో వైవిధ్యం, సంపద రక్షణ కోసం మాత్రమే బంగారాన్ని ఒక అద్భుతమైన సాధనంగా చూడటం బెస్ట్.
