ముక్కిపోతున్న దొడ్డు బియ్యం.. రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం అమ్మకానికి ప్రభుత్వం టెండర్లు

ముక్కిపోతున్న దొడ్డు బియ్యం.. రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం అమ్మకానికి ప్రభుత్వం టెండర్లు

కరీంనగర్, వెలుగు: రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం అమ్మకానికి ప్రభుత్వం ఎట్టకేలకు టెండర్లు పిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో 28,380 టన్నుల బియ్యం నిల్వ ఉండగా.. టన్నుకు కనీస ధరగా రూ.21,600గా నిర్ణయించారు. జిల్లాల వారీగా సివిల్ సప్లై అధికారులు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు నిరుడు ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అప్పటికే పంపిణీ కాకుండా  మిగిలిపోయిన దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లోనే ఉండిపోయాయి. 17 నెలలుగా నిల్వ ఉన్న ఈ బియ్యానికి పురుగులు పడుతుండడంతోపాటు స్టోరేజీ విషయంలో రేషన్ డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముక్కిపోతున్న దొడ్డు బియ్యం

రేషన్ షాపుల్లో నెలలకొద్ది బియ్యం నిల్వ చేయడంతో ఇప్పటికే పురుగుపట్టడంతో పాటు ముక్కిపోతున్నాయి. పంది కొక్కుల బెడదతో బియ్యం పూర్తిగా పాడైపోయి తినడానికి వినియోగించే పరిస్థితిలో కూడా లేవని తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 28,380 టన్నుల దొడ్డు బియ్యం షాపుల్లో ఉండగా.. అందులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1700 టన్నులు, యాదాద్రి జిల్లాలో 1635 టన్నులు, సూర్యాపేట జిల్లాలో 1200 టన్నులు, కరీంనగర్ జిల్లాలో 647 టన్నులు, పెద్దపల్లి జిల్లాలో 579 టన్నులు, వరంగల్ జిల్లాలో 847 టన్నులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 550 టన్నులు, ఖమ్మం జిల్లాలో 331 టన్నులు, కామారెడ్డి జిల్లాలో 450 టన్నులు, నిజామాబాద్ జిల్లాలో 510 టన్నులు నిల్వ ఉన్నాయి. ఒక్కో రేషన్ షాపులో 5 క్వింటాళ్ల నుంచి 15‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్వింటాళ్ల వరకు స్టాక్ ఉండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

షాపుల్లో ఉన్నాయా..? పక్కదారి పట్టాయా..?

రేషన్ షాపుల్లో బియ్యం నిల్వలు కాగితాలపై ఉన్నప్పటికీ.. షాపుల్లో ఉన్నాయా ? లేదా పక్కదారి పట్టాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పందికొక్కులు తినడం, పురుగుపట్టడం, ముక్కిపోవడంతో తరుగు వచ్చే అవకాశముందని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు రేషన్ డీలర్లు ఇప్పటికే రైస్ మిల్లులకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి.

కిలోకు రూ.37 ఖర్చు చేసి.. రూ.21.60కి అమ్మకం..

ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి.. మిల్లర్లకు అప్పగించి బియ్యం మార్చాక తీసుకుంటోంది. ఇందుకోసం టన్నుకు సుమారు రూ.37 వేల వరకు ఖర్చవుతోంది. కానీ దొడ్డు బియ్యానికి మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో టన్నుకు రూ.21,600కే అమ్మాల్సి వస్తోంది. బియ్యం కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి.. తక్కువ ధరకు అమ్మడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.