కోరుట్ల, వెలుగు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని ఏకలవ్యనగర్‌కు చెందిన పాలకుర్తి సతీశ్, అంగడి శిరీష గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
సతీశ్ గల్ఫ్‌లో ఉన్న సమయంలో తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని శిరీష తెలిపింది. అతడి మాటలను నమ్మి ఏడాది క్రితం వేరే వ్యక్తితో కుదిరిన నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే 20 రోజుల క్రితం గల్ఫ్ నుంచి స్వగ్రామానికి వచ్చిన సతీశ్‌ను పెళ్లి విషయమై నిలదీయగా తనను పట్టించుకోకుండా పెళ్లికి నిరాకరించాడని ఆరోపించింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని శిరీష వాపోయింది. దీంతో ఆదివారం సతీశ్ ఇంటి ముందు బైఠాయించి నిరసనకు దిగింది. సతీశ్ తనను పెళ్లి చేసుకునే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేసింది.
