సైదాపూర్, వెలుగు: తల్లి తమ ఇంట్లో చనిపోతే ఇల్లు వదిలాల్సి వస్తుందన్న భయంతో ఇద్దరు కొడుకులు కలిసి ఆ తల్లిని బావిలో పడేసి హత్య చేశారు. ఐదు నెలల కింద కరీంనగర్ జిల్లా ఎలబోతారం గ్రామంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరు కొడుకులను పోలీసులకు సోమవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఎలబోతారం గ్రామానికి చెందిన వెంకటమ్మ (80) అనారోగ్యం, పక్షవాతం కారణంగా మంచానికే పరిమితం అయింది. దీంతో ఆమెకు నలుగురు కొడుకులు వంతుల వారీగా భోజనం పెడుతున్నారు. వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమె ఎవరి ఇంట్లోనైనా చనిపోతే.. వారు ఇల్లు వదలాల్సి వస్తుందని భయపడ్డారు.
ఈ క్రమంలో పెద్ద కుమారుడు సమ్మయ్య, చిన్న కొడుకు శ్రీనివాస్ కలిసి తమ తల్లి వెంకటమ్మను చంపేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 5న సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశారు. అనంతరం తమ తల్లి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు వెంకటమ్మ కొడుకులపై అనుమానం రావడంతో వారిపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో సమ్మయ్య, శ్రీనివాస్ కలిసే వెంకటమ్మను హత్య చేసినట్లు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు.
