- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- జూపల్లి కృష్ణారావుతో కలిసి వనపర్తి జిల్లాలో కర్నెతండా లిఫ్ట్ ప్రారంభం
వనపర్తి/ఖిల్లాగణపురం/అచ్చంపేట, వెలుగు : రూ. 3 వేల కోట్లు ఖర్చు చేసి శ్రీశైలం సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఖిల్లాగణపురం మండలం కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను , అచ్చంపేట నియోజకవర్గంలో హ్యామ్ రోడ్డు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి అన్ని ప్రాంతాలు సమానమేనన్నారు. మూడేండ్లలో కాళేశ్వరం కట్టామని చెబుతున్న బీఆర్ఎస్నాయకులు కర్నెతండా ఎత్తిపోతలను ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 5 లక్షల చొప్పున ఇస్తోందని, దేశంలోని ఏ ప్రభుత్వమూ ఇండ్ల కోసం ఇలా ఖర్చు పెట్టడం లేదన్నారు.
బీఆర్ఎస్పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తాము అధికారంలోకి రాగానే స్మార్ట్‌రేషన్‌కార్డులు ఇస్తున్నామని చెప్పారు. వనపర్తిని ఎమ్మెల్యే మేఘారెడ్డి వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలుస్తారన్నారు. కర్నెతండా లిఫ్ట్ కు గిరిజనుల ఆరాధ్యదైవమని సంత్సేవాలాల్పేరును పెట్టేలా జీవో తీసుకొస్తామని చెప్పారు.
నల్లమల ప్రాంతంలో 146.71 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి, కలెక్టర్లు ఆదర్శ్ సురభి, హేమంత్ కేశవ్ పాటిల్, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో యాదయ్య, వనపర్తి, పెబ్బేరు మున్సిపల్చైర్మన్లు మాధవి, శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ పూల్యానాయక్ పాల్గొన్నారు.
అప్పులున్నా ఏ పథకాన్నీ ఎత్తేయలేదు : జూపల్లి కృష్ణారావు
బీఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని, అయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ పథకాన్నీ ఎత్తేయకుండా కొనసాగిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. పిల్లలు మంచిగా చదువుకొని భవిష్యత్ లో స్థిరపడేలా తల్లిదండ్రులు చూసుకోవాలని చెప్పారు.
