అమరావతి: మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ప్రభుత్వాసుపత్రిలో ఘోర ప్రమాదం సంభవించింది. సోమవారం వేకువజామున హాస్పిటల్‌లోని మూడో అంతస్తులో ఉన్న పసిపిల్లల సంరక్షణ విభాగం (ఎన్‌ఐసీయూ)లో అగ్నిప్రమాదం సంభవించడంతో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్‌ఐసీయూలో ఉన్న ఒక వెంటిలేటర్ పేలిపోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రమాద సమయంలో ఎన్‌ఐసీయూలో 39 మంది చికిత్స పొందుతున్నారు.
మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై పిల్లలకు అమర్చిన మెడికల్ పరికరాలను తొలగించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. కాగా, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మరణించిన ప్రతి శిశువు కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘోర ప్రమాదంపై పిల్లల తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వార్డులో పొగ వ్యాపించినా ఫైర్ అలారమ్‌లు మోగలేదని, వాటర్ స్ప్రింక్లర్లు కూడా పనిచేయలేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
