చలో ఢిల్లీ పోలీస్ హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌.. కేంద్ర ప్రభుత్వ హామీల్లో జాప్యాన్ని నిరసిస్తూ సీజేపీ పిలుపు

చలో ఢిల్లీ పోలీస్ హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌.. కేంద్ర ప్రభుత్వ హామీల్లో జాప్యాన్ని నిరసిస్తూ సీజేపీ పిలుపు

న్యూఢిల్లీ: యువతకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలో శాంతియుత నిరసన మార్చ్‌‌‌‌కు పిలుపునిచ్చింది. జులై 25న ఇచ్చిన హామీల అమలును కోరుతూ ఈ ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపింది. దేశ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం, బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాలు తీసుకున్న చర్యలను సమీక్షించిన సీజేపీ.. జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకుంది. హామీలు ఇచ్చి నెల రోజులు కావస్తున్నా.. స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడంపై సీజేపీ జాతీయ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దేశ యువతకు ప్రజాస్వామ్యయుత, శాంతియుత నిరసనలకు తిరిగి రావడం తప్ప మరో మార్గం లేదని పేర్కొంటూ మార్చ్​కు పిలుపునిచ్చింది. 

ఈ మార్చ్​ ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్‌‌‌‌క్వార్టర్స్ వరకు సాగనుందని.. నీట్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబ సభ్యులు, జంతర్​మంతర్​ వద్ద పోలీసుల దాడికి గురైన బాధితులు, విద్యార్థులు, యువజన సంఘాలు ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తాయని వెల్లడించింది. జులై 25న ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని సీజేపీ నేషనల్ వర్కింగ్ కమిటీ విమర్శించింది. ప్రభుత్వ హామీలను నమ్మి అప్పట్లో దేశవ్యాప్త నిరసనలను విరమించామని.. అయితే, ప్రభుత్వం తమ నమ్మకాన్ని వమ్ము చేసిందని తెలిపింది. తమ సహనాన్ని బలహీనతగా భావించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.