- డిఫెన్స్ కంపెనీలకు బొనాంజా
- రూ.3,200 కోట్ల వ్యాపార అవకాశాలు
- డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్‌పై
- కేంద్రం ఫోకస్
- కొత్తగా 403 పరికరాలకు
- ఆర్డర్లు వచ్చే చాన్స్
న్యూఢిల్లీ: రక్షణ శాఖకు అవసరమైన టెక్నాలజీలు, యంత్రాలు, ఆయుధాలు, తయారు చేసే కంపెనీలు దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక తయారీని ప్రోత్సహించడంలో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ ఆరో పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ (పీఐఎల్) విడుదల చేసింది. దీనిద్వారా దేశీయ తయారీ సంస్థలకు భారీ వ్యాపార అవకాశాలు రానున్నాయి. ఈ జాబితాలో కొత్తగా 405 రక్షణ పరికరాలను చేర్చింది. 2032 నాటికి కంపెనీలకు రూ.3,070 నుంచి రూ.3,100 కోట్ల వరకు వ్యాపార అవకాశాలు లభించనున్నాయి.
గతంలో పూర్తి స్థాయి ఆయుధాలు, యుద్ధ విమానాల తయారీపై దృష్టి పెట్టేది. ఈసారి లైన్ రీప్లేసబుల్ యూనిట్లు, రాడార్లు, సెన్సర్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, సబ్– సిస్టమ్‌ల తయారీపై ఫోకస్ చేస్తున్నారు. ఆరో జాబితాలో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ వాటా సుమారు 56 శాతం ఉంది. ఏరోస్పేస్‌కు 21 శాతం వాటా ఉండగా, మిగిలినవి క్షిపణి, నౌకాదళ, భూతల వ్యవస్థలకు సంబంధించినవని రక్షణశాఖ తెలిపింది.
బీఈఎల్, హెచ్ఏఎల్కు బూస్ట్
సబ్– సిస్టమ్స్తయారీలో బీఈఎల్, హెచ్ఏఎల్కు అపార అనుభవం ఉంది. ఆరో లిస్ట్‌లో బీఈఎల్‌కు 227 ఐటెమ్స్, హెచ్ఏఎల్కు 86 ఐటెమ్స్ లింకై ఉన్నాయి. ఈ రెండు సంస్థలకు మొత్తం వస్తువులలో సుమారు 77 శాతం వాటా ఉంది. బీఈఎల్ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్‌లో టాప్ కంపెనీ. 2027 నాటికి 15 శాతానికి పైగా ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రైవేట్ రంగంలో డేటా ప్యాటర్న్స్, అస్త్ర మైక్రోవేవ్, పారస్ డిఫెన్స్ వంటివి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్‌లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. డ్రోన్లను గుర్తించే మైక్రోడాప్లర్ రాడార్ టెక్నాలజీని డేటా ప్యాటర్న్స్ అభివృద్ధి చేస్తోంది. అస్త్ర మైక్రోవేవ్ రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ రంగంలో ప్రత్యేక సేవలు అందిస్తోంది.
డ్రోన్ సెగ్మెంట్‌కూ భారీ గిరాకీ
పారస్ డిఫెన్స్ సంస్థ యాంటీ డ్రోన్ మార్కెట్ కోసం ఎలక్ట్రో ఆప్టిక్స్ పరికరాలను అందిస్తోంది. రాబోయే పదేళ్లలో యాంటీ డ్రోన్ ఆయుధాల మార్కెట్ ఐదు బిలియన్ డాలర్లకు చేరొచ్చని అంచనా. దేశీయ మార్కెట్ రూ.45 వేల కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
ఆరో పీఐఎల్ నాలుగు కంపెనీలకు మాత్రమే పరిమితం కాదు. విడిభాగాలు, సబ్ సిస్టమ్స్ తయారీ వైపు జరుగుతున్న మార్పు ఎంఎస్ఎంఈలకూ మేలు చేస్తుంది. రాడార్ భాగాలు, సెన్సర్లు, కమ్యూనికేషన్ మాడ్యూల్స్ వంటి విడిభాగాలను సరఫరా చేయడం ద్వారా చిన్న, మధ్యతరహా పరిశ్రమలూ అవకాశాలను దక్కించుకోవచ్చు.
సవాళ్లూ ఉన్నాయ్
డిఫెన్స్ కంపెనీలకు అపార అవకాశాలు ఉన్నప్పటికీ, కొన్ని సవాళ్లు , ఆర్థిక పరిమితులు అడ్డంకిగా మారాయి. దేశీయ కంపెనీలు పరిశోధనల కోసం తమ ఆదాయంలో సుమారు 3.5 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు సుమారు 5.9 శాతం వరకు కేటాయిస్తున్నాయి.
రక్షణ రంగ కంపెనీల షేర్లు రాబోయే ఒక సంవత్సరంలో సంపాదించబోయే లాభంతో పోలిస్తే, వాటి షేర్ల ధర మార్కెట్లో 50 రెట్లు ఎక్కువగా ఉంది. అయినప్పటికీ, దేశీయంగా రక్షణ పరికరాల తయారీ పెరుగుతుండటం, ఎగుమతులు విస్తరిస్తుండటం వల్ల రక్షణ రంగానికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.
