యాదగిరిగుట్టలో ముగిసిన పవిత్రోత్సవాలు: ఆర్జిత సేవలు పునఃప్రారంభం

యాదగిరిగుట్టలో ముగిసిన పవిత్రోత్సవాలు: ఆర్జిత సేవలు పునఃప్రారంభం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగిన వార్షిక పవిత్రోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ నెల 22న శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఉత్సవాల్లో ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య విశేష పూజా క్రతువును వైభవోపేతంగా నిర్వహించారు.

ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం ప్రత్యేక హోమానంతరం.. ఆలయ మూలవిరాట్టుతో పాటు ఉప ఆలాయాల్లోని దేవతామూర్తులకు, క్షేత్రపాలక ఆంజనేయస్వామికి, ధ్వజ స్తంభానికి వేద మంత్రాల మధ్య రంగురంగుల పట్టు దారాలతో తయారు చేసిన పవిత్రమాలలను ధరింపజేశారు.

అంతకుముందు రుత్వికులు మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా పవిత్రోత్సవాల సందర్భంగా ఈ నెల 23, 24 రెండు రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేసిన ఆర్జిత సేవలు.. మంగళవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు. 

ముగింపు కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు నరసింహమూర్తి, మల్లయ్య, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శర్మ, ఏఈవోలు శ్రావణ్ కుమార్, సురేందర్ రెడ్డి, కృష్ణ గౌడ్, సూపరింటెండెంట్ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిబ్బంది ఉన్నారు.