రైతులకు గుడ్ న్యూస్ .. వడ్ల ఈ-టెండర్ కు సర్కార్ రెడీ .. క్వింటాల్కు రూ.2,389గా నిర్ణయం

రైతులకు గుడ్ న్యూస్ .. వడ్ల ఈ-టెండర్ కు సర్కార్ రెడీ .. క్వింటాల్కు రూ.2,389గా నిర్ణయం
  • బాయిల్డ్​ ఆర్డర్ ​పోను 17.54 లక్షల టన్నులకు టెండర్​

జనగామ, వెలుగు : యాసంగి సీజన్​(2025–-26) కు సంబంధించిన వడ్లను ఈ -– టెండర్​ద్వారా విక్రయించాలని సివిల్​సప్లై డిపార్ట్​మెంట్ నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్​సబ్ కమిటీ ఆమోదం సైతం పొందింది. ఇటీవల ముగిసిన యాసంగి సీజన్​లో రైతుల నుంచి సాధారణ రకం వడ్లు క్వింటాల్​కు రూ. 2,369, ఏ గ్రేడ్​రకానికి 2,389 చొప్పున కొనుగోలు చేసింది. ఈ సీజన్​లో కొనుగోలు చేసిన వడ్లలో బాయిల్డ్​అనుమతులు పోను మిగిలిన 17.54 లక్షల టన్నుల వడ్లను ఈ – టెండర్​పద్ధతిలో విక్రయించేందుకు చర్యలు చేపట్టింది.

క్వింటాల్ కు రూ. 2,389

టెండర్ పద్ధతిలో వడ్లను విక్రయించేందుకు క్వింటాల్​కు రూ. 2,389 చొప్పున నిర్ణయించింది. ఈ రిపోర్ట్​ను పరిశీలించి, చర్చించిన కేబినెట్​సబ్​కమిటీ టెండర్​విక్రయించడానికి ఆమోదం తెలిపింది. దీంతో టెండర్లు పిలిచేందుకు సివిల్​సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర జీవో నెంబర్​33 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 17.54 లక్షల టన్నుల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ. 4,190.30 కోట్లు అందనున్నాయి.

మిల్లుల్లో 10 లక్షల టన్నులు.. గోడౌన్లలో 7.54 లక్షలు

యాసంగి సీజన్ వడ్ల కొనుగోలు సమయంలో మిల్లర్లు కొంత ఇబ్బంది పెట్టారు. మిల్లుల్లో స్థలం లేదంటూ కొర్రీలు పెట్టడంతో గోడౌన్లు అద్దెకు తీసుకొని వడ్లను స్టాక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అద్దె భారంతో పాటు నిర్వహణ కూడా సివిల్​సప్లై డిపార్ట్ మెంటే చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామంలో మిల్లులో ఎఫ్​సీఐ సేకరించగా మిగిలే 10 లక్షల టన్నుల వడ్లు, గోడౌన్లలోని 7.54 లక్షల టన్నుల వడ్లను టెండర్​లో విక్రయించనున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో ఈ టెండర్​కు సంబంధించిన ప్రకటన వెలువడనుంది.

వానాకాలంలో కొన్నింటికే కేటాయింపులు

వానాకాలం 2026-27 సీజన్​లో వడ్లను సీఎంఆర్​కోసం అన్ని మిల్లులకు ఇవ్వకూడదని సివిల్ సప్లై డిపార్ట్​మెంట్​నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్ లో వడ్ల కొనుగోలు సమయంలో మిల్లర్లు ఇబ్బంది పెట్టడం, సీఎంఆర్​ విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో సివిల్ సప్లై డిపార్ట్​మెంట్​ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎంఆర్​ను సక్రమంగా అందిస్తున్న మిల్లులను గుర్తించి వాటికే వడ్లు కేటాయించే విషయంపై ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఆ మిల్లులకు కేటాయించిన వడ్లు పోనూ మిగిలిన సరుకును గోడౌన్లలో స్టాక్​ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.