సూర్యాపేట, వెలుగు: శంషాబాద్ నుంచి చెన్నై వరకు ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగానే కొనసాగాలని, ఇది ఈ ప్రాంత ప్రజలందరి బలమైన కోరిక అని బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జర్నలిస్టుల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంకినేని హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిరసన తెలుపుతున్న మీడియా ప్రతినిధులకు ఆయన పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి, వారి పోరాటానికి పూర్తి సంఘీభావం ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లాలనే ప్రజా ఆకాంక్షకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం మొదట రెండు అలైన్‌మెంట్లను సిద్ధం చేసిందని, కానీ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడో ప్రతిపాదన కారణంగా సూర్యాపేటకు రైలు రాదేమోననే తీవ్ర ఆందోళన ప్రజల్లో నెలకొందన్నారు.
గతంలో ప్రతిపాదించినట్లుగా హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌ను సూర్యాపేట– -కోదాడ మీదుగా ఏర్పాటు చేయాలని, లేకపోతే అన్ని రాజకీయ పక్షాలు కలిసి ఉద్యమిద్దామని కోదాడ నియోజకవర్గ అఖిలపక్ష నాయకులు తీర్మానించారు.
సోమవారం కోదాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కోదాడ పట్టణ, నియోజకవర్గ భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చవద్దని కోరారు.
