యాదాద్రి, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్(ట్రిపుల్ఆర్) ఫైల్ కేంద్ర రోడ్లు, బిల్డింగ్ శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ వద్దకు చేరింది. సోమవారం యాదాద్రి కలెక్టరేట్‌లో ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే అధికారులు ప్రత్యేకంగా రివ్యూ చేశారు. సాధ్యమైనంత స్పీడ్గా భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఈ రివ్యూలో ప్రధానంగా భువనగిరి మండలం రాయగిరి అంశంపైనే చర్చ జరిగింది. గతంలో భువనగిరి కాలా పరిధిలోని రాయగిరిలో సర్వేను నిర్వాసితులు అడ్డుకోవడంతో భూ సేకరణ ఆగిపోయింది.
హైవే పక్కనే ఉన్నందున, చౌటుప్పల్తరహాలో ఎకరానికి రూ. 1.20 కోట్ల వరకూ పరిహారం చెల్లిస్తే నిర్వాసితులు అంగీకరించే అవకాశం ఉందని జిల్లా ఆఫీసర్లు ఉన్నతాధికారులకు వివరించారు. ముందుగా నిర్వాసితులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఒప్పించాలని నిర్ణయించారు. రివ్యూలో నేషనల్ హైవే ఆఫీసర్లు, యాదాద్రి అడిషనల్ కలెక్టర్లు ఎ.భాస్కరరావు, వెంకారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి ఉన్నారు.
ఆర్బిట్రేషన్ పెంపు రూ. 26.12 కోట్లు జమ
ఆర్బిట్రేషన్‌లో పెంచిన పరిహారం మూడు గ్రామాల నిర్వాసితులకు అకౌంట్లలో నేషనల్హైవే జమ చేసింది. పెంచిన పరిహారం దత్తాయిపల్లి నిర్వాసితుల అకౌంట్లలో రూ. 13 కోట్లు, ఇబ్రహీంపూర్ నిర్వాసితులకు రూ. 3.21 కోట్లు, కోనాపురం నిర్వాసితులకు రూ. 9.91 కోట్లు జమయినట్లు అధికారులు తెలిపారు.
