- టైగర్ జోన్ నుంచి ఆదివాసీలను వెళ్లగొడుతున్నారని ఫైర్
- జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయాలి
- లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్
ఆదిలాబాద్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు కదం తొక్కారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీలు పెద్దఎత్తున తరలివచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినదించారు. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గొడం గణేశ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయన్నారు.
టైగర్ జోన్ నుంచి ఆదివాసీలను వెళ్లగొడుతున్నారని మండిపడ్డారు. చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఇందుకు ప్రత్యేక కమిషన్ నియమించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో ఉన్న 1/70 చట్టాన్ని సవరించాలని, కేసు వేసిన గిరిజనేతరులపై చర్యలు తీసుకొని, ఆదివాసీల పక్షాన రాష్ట్ర ప్రభుత్వామే పిటిషన్ వేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో1/70, పెసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.
పోలీస్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్ ఆదివాసీలకే ఇవ్వాలి
జీవో నంబర్ 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీస్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్ ఆదివాసీలకే ఇవ్వాలని గొడం గణేశ్ కోరారు. జీవో ఎంఎస్ నంబర్ 3ను యథావిధిగా కొనసాగించాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 120 రాయి సెంటర్లకు పక్కా భవనాలు మంజూరు చేయాలని, టైగర్ జోన్ పేరుతో ఆదివాసీ గూడాలను తరలించే ప్రయత్నాలను ఫారెస్ట్ అధికారులు విరమించుకోవాలన్నారు. బఫర్, కోర్ ఏరియా పేరుతో ఆదివాసీలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను కట్టనివ్వకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం మానుకోవాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాలలో అటవీ భూములు సాగు చేస్తున్న ఆదివాసీలకు రీ సర్వే చేసి 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు జారీ చేయాలని కోరారు. ఆదివాసీ నిరుద్యోగుల కోసం స్పెషల్ డీఎస్పీ వేయాలని, ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్త చేయాలన్నారు. సాదా బైనామా జీవో నెంబర్ 76 ను రద్దు చేయాలన్నారు. మావల మండలం కొమరం భీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసీలకు పట్టాలు నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలన్నారు.
సమస్యలు పరిష్కరిస్తామని పీవో హామీ
ఐటీడీఏ పీవో మంద మకరందు ఆదివాసీలతో మాట్లాడారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆదివాసీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు ఐటీడీఏ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పీవో హామీతో ఆదివాసీలు నిరసన విరమించారు. ఆదివాసీల ఐటీడీఏ ముట్టడి నేపథ్యంలో ఎస్పీ అఖిల్‌మహాజన్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిరసనలో తుడుం దెబ్బ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్, కొలం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనేరావు, ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు దౌలత్‌రావు, జిల్లా అధ్యక్షుడు సిడం జంగుదేవ్, మహిళా సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ గొడం రేణుక, కార్యదర్శి ఉయిక ఇందిర, తుడుం దెబ్బ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అధ్యక్షులు గోపీచంద్, మడావి వెంకటేశ్, ఆదివాసీ సంఘం మహిళ ఉపాధ్యక్షురాలు పుష్పరాణి తదితరులు పాల్గొన్నారు.
