విద్యా శాఖలో విప్లవాత్మకం‘ రెమిడీయేషన్’.. పిల్లల్లో భయాన్ని తొలగించాలి..

విద్యా  శాఖలో  విప్లవాత్మకం‘ రెమిడీయేషన్’.. పిల్లల్లో భయాన్ని తొలగించాలి..

ప్రతి తరగతిలో వివిధ వేగాలతో విద్యను నేర్చుకునే పిల్లలు ఉంటారు.  కనీస అభ్యసన స్థాయి లేని పిల్లల్లో విద్యాభ్యాసం నెమ్మదిగా సాగుతుంది. ఇటువంటి పిల్లల్లో భయాన్ని పారదోలి మౌలిక భాష,  గణిత నైపుణ్యాలను అందించడానికి విద్యాశాఖ ఇటీవల చేపట్టిన విప్లవాత్మక విద్యా కార్యక్రమమే రెమిడీయేషన్.  

ఇప్పటికే  రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తయింది.  పాఠశాల పనితీరు నివేదిక (పీజీఐ) 2025–-26  సంవత్సరానికి  సంబంధించిన  నివేదికలో అభ్యసన ఫలితాల సాధనలో  వెనుకంజలో ఉన్నాం. ఈ డొమైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంచి స్కోరు సాధించడానికి రెమిడీయేషన్ కార్యక్రమం చాలా చక్కగా ఉపయోగపడనుంది.

కేంద్ర విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన 2025-– 26 పాఠశాల పనితీరు నివేదిక ప్రకారం  దేశంలో 18వ స్థానంలో ఉన్నాం.  ఈ లోపాన్ని అధిగమించడానికి రాష్ట్ర విద్యాశాఖ రెమిడీయేషన్  అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రాథమిక స్థాయిలో అమలుపరుస్తున్నది. వారంలో మొదటి రెండు రోజులు తెలుగు,  తర్వాత  రెండు రోజులు గణితం,  చివరి రెండు రోజులు ఇంగ్లీషు  సబ్జెక్టులకు గంట చొప్పున సమయం కేటాయిస్తారు. 

ఈ ప్రక్రియలో  విద్యార్థులను  రెండు గ్రూపులుగా  విభజిస్తారు.  అభ్యసనలో  వెనుకబడిన విద్యార్థులను టీచర్ సపోర్ట్ గ్రూప్ అని,  వేగంగా నేర్చుకునే  పిల్లలను పర్ఫార్మెన్స్ గ్రూప్ అని విభజించి,  వారికి కావలసిన కనీస అభ్యసనా సామర్థ్యాలను మొదలుకొని తరగతి అభ్యసన సామర్థ్యాల వరకు  ఉపాధ్యాయులు నేర్పిస్తారు.   

తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే సత్ఫలితాలు

ప్రస్తుతం రాష్ట్రంలో  7 వేల ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. కానీ ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది.   ఒకరిద్దరు ఉపాధ్యాయులతో  నడుస్తున్న పాఠశాలలు అధికంగా ఉన్నాయి. ఉపాధ్యాయుల కొరతతో  విద్యార్థులకు  నాణ్యమైన విద్యను అందించడం కష్టమవుతోంది.  ఈ రెమిడీయేషన్  కార్యక్రమం ముందుకు పోవాలంటే 10 కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలను సమీప ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేసి ఉపాధ్యాయులను  సర్దుబాటు చేయాలి.  

అలాగే 20-–40 మధ్య విద్యార్థులు ఉన్నచోట ముగ్గురు ఉపాధ్యాయులను, 40–-60 మధ్య విద్యార్థులు ఉన్నచోట నలుగురు ఉపాధ్యాయులను,  60 మందికి పైగా విద్యార్థులు ఉన్నచోట  తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించి,  ఒక ప్రధానోపాధ్యాయుడిని ఇస్తే  ఆ పాఠశాలల్లో విద్యార్థులకు రెమిడీయేషన్ వంటి మంచి కార్యక్రమాల ద్వారా గుణాత్మక విద్య అందుతుంది.  

 అంకం నరేష్

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.రచన 700 పదాలకు మించరాదు.