పంథా మారితేనే ప్రయోజనం..పోరాటాలతో బడుగు బలహీన వర్గాలకు మేలు జరిగేనా?

పంథా మారితేనే ప్రయోజనం..పోరాటాలతో బడుగు బలహీన వర్గాలకు మేలు జరిగేనా?

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దళిత, బహుజన సామాజిక ఉద్యమాలను పరిశీలిస్తే సరియైన దిశా నిర్దేశంకానీ, సరియైన లక్ష్యం కానీ లేకుండా  సాగుతున్నాయనిపిస్తోంది. ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇదే నిజం. ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై లేదా ఒక సమాజం మరొక సమాజంపై చేస్తున్న పోరాటం తప్ప,  బడుగు బలహీన వర్గాల మేలుకోరి వారి హక్కులను కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటాలు కావని చెప్పక తప్పదు. 

ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దేశంలో అణచివేతకు, అంటరానితనానికి గురి అవుతున్న వర్గాల అభ్యున్నతి కోసం డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి రాజ్యాంగం ద్వారా హక్కులను కల్పిస్తే, ఇన్ని సంవత్సరాలైనా ఆ హక్కులను సరియైన రీతిలో వినియోగించుకోలేకపోతున్నారు.  హక్కులు నేడు క్రమంగా కోల్పోతున్నా.. బడుగు, బలహీన వర్గాలకు నాయకులుగా చలామణి అవుతున్న ఏ ఒక్క నాయకుడు ఆ హక్కులు హరిస్తున్నవారిని ఎదిరించటం లేదు,  ఆ దిశగా వారి సమాజాన్ని చైతన్యపరచటం లేదు.


భారతదేశ చరిత్ర గమనిస్తే అన్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు అనేక సామాజిక ఉద్యమాలు చేశారు. ఆ సామాజిక ఉద్యమాల ఫలితంగానే సమాజంలో, చట్టాల్లో మార్పులు వచ్చాయి.  నాటి మన మహనీయుల కృషి ఫలితమే మన ఈనాటి జీవనం అన్నది గుర్తుంచుకోవాలి. అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాల వ్యత్యాసం ఉన్నది. కాలం మారింది,  పరిస్థితులు మారాయి కానీ ఈ దేశ జనాభాలో 85% ఉన్న బహుజనులు ఇప్పటికీ వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. 

అసలు ఎందుకు ఇంకా పోరాటాలు చేయవలసి వస్తోంది? ఆధిపత్య కులాల ఆధిపత్యం ఇంకా ఎందుకు కొనసాగుతోంది? కారణం ఏంటి? అసలు, ఇప్పుడు చదువు ఉంది, జ్ఞానం ఉంది, ఆర్థిక, రాజకీయంగా కూడా కొంత అభివృద్ధి చెందాం. మరి ఎందుకు ఇంకా ఈ బహుజనులు వారి హక్కుల కోసం పోరాటాలు చేయవలసి వస్తున్నది?  1

949 నవంబర్ 25న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో చేసిన చివరి ప్రసంగంలో 1950 జనవరి 26న  ‘మనం ఒక వైరుధ్య జీవితంలోకి అడుగు పెడుతున్నాం, రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది, ఒక మనిషి ఓటు విలువ.. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాలి’ అని పేర్కొన్నాడు.

చారిత్రక ఉద్యమాలు సాధించిన విజయాలు

సత్యశోధక ఉద్యమం: జ్యోతిరావు ఫూలే 1873వ సంవత్సరంలో సత్యశోధక సమాజాన్ని స్థాపించాడు. శూద్ర, - అతి శూద్ర ప్రజల బానిసత్వానికి కారణం బ్రాహ్మణీయత అని అన్నాడు. బలిరాజు కాలం బహుజనుల స్వర్ణయుగం అన్నాడు. భార్య సావిత్రి బాయితో కలిసి 1848వ సంవత్సరంలో పూణేలో తొలి బాలికల పాఠశాలను స్థాపించారు. శూద్రులు, అతి శూద్రులను కలుపుకొని దళిత బహుజన ఉద్యమాలకు పునాది వేసింది ఫూలేనే. ఫూలే బహుజన సమాజాన్ని విద్య, జ్ఞానంవైపు నడిపించారు.

స్వాభిమాన ఉద్యమం : పెరియార్ ఈవి రామస్వామి 1925వ సంవత్సరంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. పెరియార్ బహుజన ఉద్యమానికి రాడికల్ రూపం ఇచ్చాడు. కుల నిర్మూలన,  మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా,  స్త్రీల ఉన్నతి కోసం పోరాడాడు.  రామాయణం, మహాభారతాలు బహుజనులను బానిసలుగా చేసే కథలన్నాడు. బహుజనులను రాజ్యాధికారం వైపు మళ్లించాడు.

ఆది హిందూ ఉద్యమం : భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్  కేంద్రంగా ఆది హిందూ ఉద్యమాన్ని నడిపాడు. మేము అంటరానివాళ్లం కాదు. ఈ దేశ మూల వాసులం అని చాటాడు. 1906వ సంవత్సరంలో జగన్ మిత్రమండలిని స్థాపించి దేవదాసి, జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. దళితుల కోసం 26 పాఠశాలలను, 4 హాస్టల్ లను, ఆది హిందూ భవన్‌‌‌‌ను నిర్మించాడు. ఈ ఉద్యమ ఫలితంగా దళితులకు ఆది హిందూ అనే ఆత్మగౌరవ పేరు వచ్చింది. విద్య, ఉద్యోగ అవకాశాలు వచ్చాయి.

మండల్ ఉద్యమం :1979 సంవత్సరoలో  బీపీ మండల్ నేతృత్వంలోని కమిషన్ 3743 ఓబీసీ కులాలను  గుర్తించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లను సిఫార్సు చేసింది. 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ సిపార్సులు అమలు చేస్తామనగానే, దేశవ్యాప్తంగా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా  ఆందోళనలు జరిగాయి. బహుజన సమాజం ఏకమై మండల్ కమిషన్ సిఫార్సులు అమలుపరచాలని ఉద్యమించగా, 1992లో సుప్రీంకోర్టు 27%  ఓబీసీ రిజర్వేషన్లను సమర్థించగా, కోట్లాది ఓబీసీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు లభించాయి.

దళిత  మహాసభ :  కారంచేడు,  చుండూరు సంఘటనలకు  వ్యతిరేకంగా బొజ్జా తారకం,  కత్తి 
పద్మారావుల నాయకత్వంలో  దళిత మహాసభ ఏర్పడింది. ఈ ఉద్యమం ఫలితంగా దళితుల రక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. దళిత మహాసభ దళితుల ఐక్యత శక్తి ఏంటో  దేశానికి  చూపెట్టింది.
రాజ్యాధికార ఉద్యమం :  కాన్షీరామ్  దళిత బహుజన ఉద్యమాన్ని రాజ్యాధికార ఉద్యమంగా మార్చాడు. BAMCEF (1978), DS- 4,(1981), BSP (1984)లను స్థాపించాడు.  85% ఉన్న బహుజనులను ఏకం చేసి రాజకీయంగా దళితులు ఎలా ఎదగాలో మార్గం వేశారు. ఒక బహుజన మహిళ అయిన మాయావతి  భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగింది.

రాజ్యాధికారం అనేది తాళంచెవి

ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్ కోసం అగ్రవర్ణాలకు చెందిన ఏ ఒక్కరైనా,  ఏనాడైనా పోరాటం చేశారా? మరి ఎలా వచ్చింది వారికి 10%  రిజర్వేషన్ ఆలోచన  చేయండి.  ఒకప్పుడు ఒకే జాతిగా ఉన్న ఎస్సీ, ఎస్టీ,  బీసీలకు నేడు ఒక జాతి అంటూ ఏదీ లేదు, అంటే లేకుండా చేశారు. 

‘మీరు కేవలం ఓట్లు  వేసేవారిగా మాత్రమే ఉంటే సరిపోదు. మీరే చట్టాలు చేసేవారిగా ఎదగాలి. లేకపోతే చట్టాలు చేసేవారు ఎప్పటికీ మీకు యజమానులుగానే ఉంటారు. అని డా. బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు అక్షర సత్యం. ‘ రాజ్యాధికారం అనేది అన్ని తాళాలను తెరిచే మాస్టర్ తాళం చెవి లాంటిది. ఆ ఒక్క తాళం మీ చేతికి వస్తే, విద్య, ఉద్యోగం, ఆత్మగౌరవం, ఆస్తి, రక్షణ అనే అన్ని తలుపులు మీకే తెరుచుకుంటాయి’ అని చెప్పిన అంబేద్కర్  మాటలను బహుజన నాయకత్వం అర్ధం చేసుకొని,  హక్కులతోపాటు రాజ్యాధికారం కోసం జాతిని చైతన్యం చేసి, ఆ దిశగా ప్రయాణం సాగిస్తేనే  బహుజనులకు మేలు జరుగుతుంది తప్ప మరొక విధంగా కాదు.

​ఐక్యతకు పునాది వేసిన ఉద్యమాలు

ఈ దేశంలో దళిత, బహుజన సామాజిక ఉద్యమం దాదాపుగా రెండు వందల ఏళ్ళ నుంచి కొనసాగుతోంది.  జ్యోతిరావ్ ఫూలేతో  మొదలై  బాబా సాహెబ్ అంబేద్కర్ తో ఉవ్వెత్తున ఎగిసి కాన్షీరాం రాజ్యాధికారం వరకు వచ్చింది. ఇప్పటివరకు జరిగిన  ప్రతి సామాజిక ఉద్యమాన్ని గుణాత్మాకంగా పరిశీలన చేస్తే  ప్రతి ఉద్యమం కూడా కచ్చితమైన సత్ఫలితాన్ని ఇచ్చింది, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వమే అంతిమ లక్ష్యమని చాటిచెప్పుతూ బహుజన సమాజానికి సరియైన మార్గ నిర్దేశం చేసి బహుజన ఐక్యతకు పునాది వేశాయి.  ఆధిపత్య కులాలు వారి వారసులకు  సంపదను, జ్ఞానాన్ని, రాజ్యాధికారాన్ని వారసత్వంగా ఇస్తుంటే బహుజనులు మాత్రం అంటరానితనాన్ని , బానిసత్వాన్ని , ఉద్యమాలను వారసత్వంగా ఇస్తున్నారు. 

- ఎం. రవీందర్​
స్టేట్ జనరల్​ సెక్రటరీ (టీమ్)

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.