ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉన్న తక్షణ సవాళ్లు కేవలం భారతదేశ వృద్ధి రేటును అధికంగా ఉంచడం మాత్రమే కాదు. ఆర్థిక వ్యవస్థ అందరికీ ప్రయోజనం చేకూర్చేలా చేయడం, తాము అణగారినవాళ్లం కాదనే భావనను ప్రజలలో కలిగించడం ఆయన ముందున్న ప్రధాన సవాలు. ఒక వ్యక్తి నెలకు లక్ష రూపాయలు సంపాదించినా, ఇతరులు అంతకంటే చాలా ఎక్కువ సంపాదిస్తుంటే తాను అణగారినవ్యక్తిగా భావించవచ్చు.
2014లో మోదీ ప్రధానమంత్రి అయినప్పటినుంచి స్థిరమైన వృద్ధిరేటు లక్షలాది మంది కోటీశ్వరులను సృష్టించింది. అయితే ఇది మరోవైపు ఇతరులలో అభద్రతా భావాలను కూడా కలిగించిందనేది వాస్తవం. మే 4, 2026న బీజేపీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో భారీ విజయం సాధించినప్పుడు, తమిళనాడులో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన డీఎంకేకు చెందిన స్టాలిన్ ఓడిపోయినప్పుడు.. ఈ రాజకీయ పరిణామాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 2029 వరకు సునాయాసంగా ముందుకు కొనసాగడానికి తగినంత ఊపునిచ్చి ఉండాలి. కానీ, ఆకస్మిక సంఘటనలు ప్రధాని మోదీ పాలనకు సవాళ్లను సృష్టిస్తున్నాయి.
అర్థశాస్త్రంలో 1958లో ప్రొఫెసర్ ఎ.డబ్ల్యూ. ఫిలిప్స్ ప్రతిపాదించిన ఫిలిప్స్ కర్వ్ అనే ఒక గొప్ప సిద్ధాంతం ఉంది. దాని ప్రకారం అధిక ద్రవ్యోల్బణంతో నిరుద్యోగం తగ్గవచ్చు, కానీ తక్కువ ద్రవ్యోల్బణం మరింత నిరుద్యోగానికి దారితీయవచ్చు. ఫిలిప్స్ కర్వ్ సిద్ధాంతం అనేది ఒక క్లిష్టమైన ఆర్థిక సర్దుబాటు. ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తే ఉపాధి దెబ్బతినవచ్చు. కానీ ఎక్కువ ఉపాధి కల్పించడానికి ధరలు పెరగవచ్చు.
ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదే. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పుడు దీనినే ఎదుర్కొంటున్నారు. ఈ చిక్కుముడిని విప్పడానికి మోదీకి ప్రముఖ ఆర్థికవేత్త, దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి ఒక మేధావి అవసరం. ఇప్పటివరకు మోదీ తన పాలనలో అటువంటి ఆర్థిక మేధావిని కనుగొన్నారనడానికి ఆధారాలు ఆశాజనకంగా లేవు.
జెన్ జీ, ప్రభుత్వ వ్యతిరేకత
దేశంలో రాజకీయ ప్రమాదం ఏమిటంటే భారతదేశ యువత ఆర్థిక వ్యవస్థను ఆర్థికవేత్తల కంటే భిన్నంగా అంచనా వేయడం. ఒక వ్యక్తికి వ్యక్తిగత ప్రయోజనం చేకూరితే తప్ప జీడీపీ పెరుగుదల అతనికి పెద్దగా ప్రయోజనం చేకూర్చదు. ఇటీవలి యువత నిరసనలు జెన్ జెడ్ ప్రభుత్వ వ్యతిరేకత కొత్త రూపం ఆవిర్భవించడాన్ని సూచిస్తున్నాయి.
ఇది సైద్ధాంతికంగా మరింత అసహనంతో సోషల్ మీడియా ద్వారా బలోపేతమై విస్తరిస్తోంది. కోటిమంది యువతకు ఏఐ శిక్షణ, ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ఇస్తామని మోదీ ప్రకటించడం వెనుక ఉన్న కారణం ఆయన ఈ సమస్యను అంగీకరించడమే. కానీ అసలైన పరీక్ష ఫలితాలు ఉద్యోగాలు, నిష్పక్షపాత పరీక్షలు, పురోగతి, ఆర్థిక వృద్ధి సాధించడం.
2027 ఎన్నికల ఒత్తిడి
2027లో జరగనున్న ఏడు రాష్ట్రాల ఎన్నికలు కేంద్రంలోని మోదీ సర్కార్‌కు కీలక పరీక్ష కానున్నాయి. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి.
ఆర్థికవ్యవస్థ, యువత అసంతృప్తి ఎన్నికలలో ప్రభావాన్ని చూపుతాయా లేదా లేదా అనేది కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మొదటి ప్రధాన రాజకీయ పరీక్షను నిర్వహించనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీకి ఉత్తర ప్రదేశ్, గుజరాత్ ఈ రెండు రాష్ట్రాలు రాజకీయంగా చాలా ముఖ్యమైనవి.
2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోదీ సారథ్యంలోని బీజేపీ ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తోపాటు ప్రతి రాష్ట్రంలోనూ మంచి పనితీరు కనబరచాల్సి ఉంటుంది. పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో మోదీ ఆర్థిక వ్యవస్థను ఎంత త్వరగా చక్కదిద్దుతారనే దానిపై బీజేపీ నైతిక స్థైర్యం ఆధారపడి ఉంటుంది.
బీజేపీలో యువతరానికి పెద్దపీట
యువతను రాజకీయపరంగా ప్రోత్సహించి అధికారంలోకి తీసుకురావడానికి నరేంద్ర మోదీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి అనుభవరాహిత్యం, దూకుడుగా తీసుకునే నిర్ణయాలు పాలనాపరంగా రాజకీయ సమస్యలను సృష్టించవచ్చనేది పొంచిఉన్న ప్రమాదం. దీనికి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఉదాహరణ. కాంగ్రెస్ సీనియర్ నాయకులను కీలక పదవుల నుంచి తొలగించి కొత్తవారికి అవకాశాలు కల్పించినప్పటికీ విజయాలకు అవసరమైన చైతన్యం ఆ పార్టీలో రాలేదు.
మోదీకి అతిపెద్ద సవాలు ధరల తగ్గుదల
ప్రపంచ వ్యాప్తంగా అమెరికాతో సహా అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఎదుర్కొంటున్న కొత్త సవాలు సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ధరలు ఉండేలా చూడటం. భారతదేశానికి తదుపరి ఆర్థిక సవాలు కేవలం ద్రవ్యోల్బణం మాత్రమే కాదు. అది అందుబాటులో ధరలు ఉంచగలగాలి.
ముఖ్యంగా యువ కార్మికులు, దిగువ, మధ్యతరగతి వర్గాలవారికి ఆర్థిక విధాన ప్రభావం సమస్యలు సృష్టిస్తోంది. అభివృద్ధి బలంగా ఉండవచ్చు, కానీ ప్రజల ఖర్చు చేయగల ఆదాయం పరిమితంగా ఉంటే సగటు ఓటరు ఆ వృద్ధిని ఆర్థికాభివృద్ధి ఫలితంగా అనుభవించకపోవచ్చు. అందుబాటు ధరలు ఉండేలా చూడటం కేవలం ప్రధాని మోదీకి మాత్రమే కాదు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులందరికీ అతిపెద్ద సవాలు. అందువల్ల ప్రధాని మోదీ కేవలం జీడీపీపైనే కాకుండా, సామాన్య ప్రజల వాస్తవ కొనుగోలు శక్తిపై కూడా దృష్టి పెట్టాలి. ఈ సమస్యకు పరిష్కారం ప్రత్యక్ష నగదు బదిలీలు లేదా ఉచితాలు కల్పించడం కాదు. అధిక జీడీపీ వృద్ధితోపాటు, ప్రజలకు అందుబాటు ధరలు ఉండేవిధంగా దాదాపు పరిపూర్ణమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం. దాంతో యువతకు ఉద్యోగాలు కల్పించగలగడం జరగాలి.
ప్రజలు కోరుకుంటోంది మెరుగైన ఆర్థిక వ్యవస్థ
అధిక పన్నులు, జీఎస్టీ , ద్రవ్యోల్బణం అనేవి మౌలిక సదుపాయాలలో భారీ పెట్టుబడులపై అతిగా దృష్టి పెట్టడాన్ని పాక్షికంగా ప్రతిబింబించవచ్చు. బహుశా మోదీ పాలనాపరమైన ఖర్చులను తగ్గించడం, అందుబాటులో ఉండేవిధంగా ధరల తగ్గుదలపై దృష్టి సారించడంతోపాటు పన్నులనూ జాగ్రత్తగా తగ్గించాల్సిన సమయం ఆసన్నమైంది.
ప్రభుత్వం వ్యయాన్ని ఒక ప్రధాన ఆర్థిక సూచికగా మార్చాలి. ఎందుకంటే ఓటర్లకు, జీడీపీ కొలవగలిగే దానికంటే తాము ఆర్థికంగా ఎంత భరించగలమనేదే ముఖ్యం. మోదీ ప్రజాదరణ లేని నాయకుడు కాదు. కానీ ప్రజలు మెరుగైన ఆర్థిక వ్యవస్థను కోరుకుంటారు, లేకపోతే వారు జాతీయ భద్రత, విదేశీ విజయాలు, దేశభక్తి, మిగతా అన్నింటినీ మరచిపోవచ్చు.
ప్రపంచం నడిచే తీరు ఇదే. నరేంద్ర మోదీ, బీజేపీ రాజకీయ పోరాటాలలో గెలవగలరు. కానీ మోదీ ఆర్థికవ్యవస్థ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోగలరా? చమురు ధరలు పెరిగినప్పుడు ఆర్థికవ్యవస్థను నిర్వహించడం అంత సులభం కాదు. ప్రధాని మోదీ ఈ ఆర్థిక సవాలును సమర్థవంతంగా ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిస్తే మిగతా సమస్యలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి.
అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావం
వాస్తవానికి ఫిబ్రవరి 28, 2026న అమెరికా, -ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పుడే మోదీ సర్కార్‌కు అసలు సవాలు మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే ధరలు పెరగడం, నిరుద్యోగం పెరగడం ప్రారంభమైంది. అంతేకాకుండా, ఏఐ (కృత్రిమ మేధస్సు) రాకతో లక్షలాదిమంది ఉద్యోగులు మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు కోల్పోయారు.ఈ సమస్యలన్నీ మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌కి ఒక పెను సంక్షోభాన్ని సృష్టించాయి.
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్నప్పటికీ, దేశంలో యువతకు ఉపాధి కల్పన పరిస్థితి అంతగా ఆశించిన స్థాయిలో లేదు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత గణనీయంగా ఉంది. యువతకు ఉపాధి కల్పన అనేది ముఖ్యంగా సున్నితమైన రాజకీయ సమస్యగా మారింది.
అదేవిధంగా పరీక్షల అవకతవకలపై ఇటీవల జెన్ జెడ్ నేతృత్వంలో జరిగిన నిరసనలు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఒక నిర్దిష్ట వ్యవస్థకు వ్యతిరేకంగా ఎంత త్వరగా వి స్తృత తిరుగుబాటుగా మారగలదో నిరూపించాయి. రాబోయే కాలంలో ప్రధాని మోదీకి ఎదురయ్యే ప్రధాన ఆర్థిక సవాలు ఇదే. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూనే భారతదేశ యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించడం చాలా అవసరం.
- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
