ఓపెన్ కాస్ట్లకు వాన కష్టాలు.. గనుల్లోకి చేరిన వరద.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఓపెన్ కాస్ట్లకు వాన కష్టాలు.. గనుల్లోకి చేరిన వరద.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి
  • భూపాలపల్లి ఏరియాలో రూ.80 కోట్లు లాస్.. పునరుద్ధరణ చర్యలు స్పీడప్

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జయశంకర్​భూపాలపల్లి జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1, కేటీకే ఓసీ-2 గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గనుల్లోకి భారీగా వరద చేరడంతో రోజుకు సుమారు 10 వేల టన్నుల చొప్పున రెండు గనుల్లో కలిపి 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

మట్టి తొలగింపు పనులతో పాటు బొగ్గు ఉత్పత్తి కూడా పూర్తిగా నిలిచిపోయింది. గనులకు వెళ్లే రహదారులు బురదమయంగా మారడంతో రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. డంపర్లు, షవల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర భారీ యంత్రాలు యార్డులకే పరిమితమయ్యాయి.

20 వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం..
జిల్లాలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఆదివారం మొదటి షిఫ్ట్‌‌‌‌‌‌‌‌ నుంచే రెండు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కేటీకే-1 గనిలో రోజుకు 40 వేల క్యూబిక్‌‌‌‌‌‌‌‌ మీటర్ల మట్టిని తొలగించి సుమారు 4,500 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉంది.

అయితే వర్షాల కారణంగా పనులు నిలిచిపోయాయి. అలాగే కేటీకే ఓసీ-2 గనిలో రోజుకు 60 వేల క్యూబిక్‌‌‌‌‌‌‌‌ మీటర్ల మట్టిని తొలగించి సుమారు 5,500 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉండగా, వరద నీరు చేరడంతో పనులు ముందుకు సాగడం లేదు.

రెండు గనుల్లో రెండు రోజులుగా పనులు నిలిచిపోవడంతో ఏరియా నుంచి సంస్థకు సుమారు రూ.80 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. కేటీకే-1 గనిలో పనులు నిలిచిపోవడంతో 300 మంది కార్మికులు, 60 ట్రక్కులు, 15 షవల్స్‌‌‌‌‌‌‌‌ యార్డులకే పరిమితమయ్యాయి. కేటీకే ఓసీ-2 గనిలో 450 మంది కార్మికులు, 80 ట్రక్కులు, 18 షవల్స్‌‌‌‌‌‌‌‌ కూడా యార్డుల్లోనే నిలిచిపోయాయి.

పునరుద్ధరణ చర్యలు
గనుల యార్డుల్లోకి చేరిన నీటిని పంపింగ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ఆఫీసర్లు పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేశారు. గనుల మేనేజర్లు, పీవోలు గనుల్లోకి వెళ్లి ఆయా పనులను పరిశీలిస్తున్నారు. కేటీకే-1 గనిలో 240 హెచ్‌‌‌‌‌‌‌‌పీ సామర్థ్యం కలిగిన తొమ్మిది మోటర్లతో రోజుకు 5.18 కోట్ల గ్యాలన్ల నీటిని ఎత్తిపోస్తున్నారు. కేటీకే ఓసీ-2లోనూ ఎనిమిది మోటర్ల ద్వారా నీటిని బయటకు పంపే ప్రక్రియను స్పీడప్​ చేశారు. '

ఈ నెల మొదటి వారంలోనూ రెండు రోజుల పాటు వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం మరో రెండు రోజులుగా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో ఈ నెలలో ఇప్పటివరకు సుమారు 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి గండిపడినట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఫలితంగా సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది.