వృద్ధాప్యం జీవితానికి ముగింపు కాదు.. జీవితమంతా నేర్చుకున్న జ్ఞానాన్ని, అనుభవాలను తరువాతి తరానికి అందించే గొప్ప దశ. వయసు పెరిగినకొద్దీ బలహీనత, అనారోగ్యం, ఒంటరితనం సహజమే అయినా.. వృద్ధుల జీవితాలు అనుభవాల పుస్తకంలోని విలువైన అధ్యాయాలు. వారు ఎదుర్కొన్న కష్టాలు యువతకు పాఠాలు. సాధించిన విజయాలు స్ఫూర్తి. చేసిన తప్పులు హెచ్చరికలు.
నేటితరం సాంకేతిక పరిజ్ఞానంలో ముందున్నా, సమాచారం వేరు.. అనుభవం వేరు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో పెద్దల సలహా ఎంతో విలువైనది. ఆధునిక జీవన విధానంలో వృద్ధులు ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం పిల్లలు దూర ప్రాంతాలకు, విదేశాలకు వెళ్లడంతో ఒకప్పుడు సందడిగా ఉన్న ఇళ్లు నిశ్శబ్దంగా మారుతున్నాయి.
కానీ ఆప్యాయంగా మాట్లాడే మనిషి, తమ మాట వినే మనసు, కొంత సమయం మాత్రం అవసరం. ఒక ఫోన్ కాల్, పలకరింపు కూడా వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. వృద్ధులను గౌరవించడం కేవలం పండుగల రోజుల్లో పాదాభివందనం చేయడం కాదు.
వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం, ఆరోగ్యాన్ని పట్టించుకోవడం, అవసరమైనప్పుడు తోడుగా నిలవడం మన బాధ్యత. వ్యవసాయం, చేతివృత్తులు, కుటుంబ విలువలు, సంప్రదాయాలు, సామాజిక సంబంధాలపై వారి అనుభవం సమాజానికి అమూల్యమైన సంపద. వృద్ధాప్యం వచ్చినంత మాత్రాన జీవితం ఆగిపోదు. వారి ఆదరణతో మనకు లభించే అనుభవాలు విలువైనవి. వృద్ధులను గౌరవించడం అంటే మన మూలాలను గౌరవించడమే.
- ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
