- మంత్రుల బంగ్లాల రిపేర్లకు భారీగా ఖర్చు పెట్టడంపై విమర్శ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల అధికారిక బంగ్లాల్లో సౌకర్యాలను మెరుగుపరచడం, ఫర్నిచర్, మెయింటెనెన్స్, రిపేర్ల కోసం గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.92.35 కోట్లు ఖర్చు చేయడంపై కాంగ్రెస్, సీజేపీ, ఆప్ తీవ్ర విమర్శలు గుప్పించాయి. ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతుంటే మంత్రుల బంగ్లాల కోసం భారీగా ఖర్చు చేయడంపై మండిపడ్డాయి. కేంద్ర మంత్రుల బంగ్లాలకు మరిన్ని సొబగులు అద్దడం కంటే ముందు ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన అధికారిక నివాసం రిపేర్ల కోసం చేసిన ఖర్చుపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన బీజేపీ.. ఇప్పుడు కేంద్ర మంత్రుల ఇండ్ల కోసం రూ.92 కోట్ల ఖర్చు చేయడమేంటని ఆప్ ప్రశ్నించింది.
గతం కంటే మూడు రెట్లు ఎక్కువ
కేంద్ర మంత్రుల అధికారిక నివాసాల నిర్వహణ బాధ్యత సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ) చూస్తుంది. బంగ్లాల రిపేర్లు, ఫర్నిచర్ తదితర పనులపై 2014–15 నుంచి 2025–26 వరకు మొత్తం 12 ఏండ్లలో రూ.547.68 కోట్లు సీపీడబ్ల్యూడీ ఖర్చు చేసింది. 2014–15లో రూ.27.47 కోట్లుగా ఉన్న ఖర్చు 2025–26లో మూడు రెట్లు పెరిగి రూ.92.35 కోట్లకు చేరింది.
స్కూళ్లలో సమస్యలు తీర్చాలని డిమాండ్
మంత్రుల నివాసం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ఖర్చుపై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో పరిస్థితులు మెరుగు పరచడం కోసం క్యాంపెయిన్ చేస్తున్న సీజేపీ స్పందిస్తూ.. రూ.92 కోట్లతో 10 కొత్త ఆధునిక ప్రభుత్వ స్కూళ్లు నిర్మించవచ్చని పేర్కొన్నారు.
